రాష్ట్రంలో పెను సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్(Phone Tapping Case) కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం(Special Investigative Team) దూకుడు పెంచింది. వీరి కస్టడీలో ఉన్న సస్పెండ్ ఎస్ఐబీ డీఎస్పీ ప్రణీత్ రావు (Praneeth Rao) విచారణలో వెల్లడించిన వివరాల మేరకు పంజాగుట్ట పోలీసులు(panjagutta police) ఏకకాలంలో పది చోట్ల సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఈ జాబితాలో పోలీసు ఉన్నతాధికారుల ఇళ్లు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావుతో పాటు మరి కొందరు అధికారుల ఇళ్లల్లో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇంటెలిజెన్స్ మాజీ ఎస్పీ భుజంగరావు, ఎస్ఐబీ డీఎస్పీ తిరుపతన్న ఇళ్లల్లో అధికారులు సోదాలు జరుపుతున్నారు. హైదరాబాద్ సిటీ మాజీ టాస్క్ఫోర్స్ డీసీపీ రాధా కిషన్ రావు ఇంట్లోనూ సోదాలు నిర్వహిస్తున్నారు.
పోలీసులు అధికారుల ఇళ్లతో పాటే ఓ న్యూస్ చానెల్ ఎండీ శ్రవణ్ రావు ఇంట్లో కూడా పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం అందింది. అయితే, ఆ న్యూస్ చానెల్ ఎండీ ఇప్పటికే విదేశాలకు పారిపోయినట్లు టాక్ వినిపిస్తోంది. అయితే, ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో త్వరలోనే మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందని పోలీసు వర్గాలు వెల్లడించాయి.
ప్రణీత్ రావు మొన్నటివరకు దర్యాప్తు బృందం విచారణలో నోరు విప్పడం లేదని తెలిసింది. తాజాగా ఆయన్ను ఫోన్ ట్యాపింగ్ ఎవరు చేయమన్నారు? ఎందుకు చేయమన్నారు? దీనంతటికి కారణం ఎవరు? ఆయన వెనుకాల ఎవరు ఉన్నారు? ఎందుకు ఇదంతా చేయాల్సి వచ్చింది. అనే అంశాలపై ఇప్పుడిప్పుడే నోరువిప్పుతున్నట్లు అధికారులు తెలిపారు. గత సర్కారు టైంలో ఓ మంత్రి ఆదేశాల మేరకు ట్యాపింగ్ చేశానని, వారి ఆర్డర్స్ ఫాలో అయినట్లు ప్రణీత్ రావు విచారణలో అంగీకరించినట్లు సమాచారం. డేటా ఎరేజ్ కూడా అందుకే చేసినట్లు పేర్కొన్నట్లు తెలుస్తోంది.