తాళం వేసిన ఇండ్లే టార్గెట్‌గా దొంగలు (Theifs)రెచ్చిపోతున్నారు. ముందుగా రెక్కీ నిర్వహించి ఎవరూ లేరని ధృవీకరించుకున్నాకే వారు తమ పంజా విసురుతున్నారు.పట్టణ ప్రాంతాల్లో జనాభా పెరిగిపోవడంతో దొంగలు తమ చేతివాటాన్ని ఇట్టే ప్రదర్శిస్తున్నారు.దీంతో ఇంటికి తాళం వేసి ఏటైనా వెళ్లాలంటే ప్రజలు జంకుతున్నారు.
తాజాగా ఓ దొంగ చాకచక్యంగా వ్యవహరించి తాళం వేసి ఉన్న ఓ ఇంటికి కన్నవేశాడు. ఇంట్లోని నగదుతో పాటు బంగారంతో ఊడాయించాడు. ఈ ఘటన నిజమాబాద్ జిల్లాలోని మద్నూర్ మండల కేంద్రంలో బుధవారం వెలుగుచూసింది. ఎస్సై శ్రీకాంత్ కథనం ప్రకారం..మహాజన్ బాలాజీ తండ్రి విఠల్ వడ్డీ వ్యాపారి.
మంగళవారం సాయంత్రం 7 గంటల ప్రాంతంలో సరుకులు కొనుగోలు చేసేందుకు మార్కెట్‌కు వెళ్లాడు. సుమారు రాత్రి 8.45కు తిరిగి ఇంటికి వచ్చేసరికి ఇంటి తాళం పగులగొట్టి ఉంది.ఇంట్లోకి వెళ్లి చూడగా బీరువా కూడా తెరిచి ఉంది. అయితే, బీరువాలోని రూ.13లక్షల విలువ చేసే 25 తులాల బంగారంతో పాటు రూ.16వేల నగదు కనిపించలేదు.
బాధిత వ్యక్తి వెంటనే పోలీసులను ఆశ్రయించాడు. ఈ మేరకు దొంగతనం జరిగినట్లు నిర్దారించుకుని, క్లూస్ టీం సాయంతో వివరాలు సేకరించి.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు.ఇకమీదట ఎవరైనా విలువైన వస్తువులు ఇంట్లో వదిలి వెళ్లేటప్పుడు చుట్టుపక్కల వారిని కాస్త గమనించాలని చెప్పి వెళ్లాలని పోలీసులు సూచించారు.