ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టైన ఎమ్మెల్సీ కవిత(MLC KAVITHA) బెయిల్ పిటిషన్లపై రౌస్ ఎవెన్యూ కోర్టు విచారణ జరపనున్న నేపథ్యంలో ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కౌంటర్ పిటీషన్ దాఖలు చేసింది. ఈడీ కస్టడీ (ED CUSTODY) ముగియడంతో ప్రస్తుతం ఎమ్మెల్సీ కవిత తిహార్ జైలులో జ్యుడీషియల్ రిమాండ్ ఖైదీగా ఉన్నారు.
ఈ నేపథ్యంలోనే కవిత మధ్యంతర, సాధారణ బెయిల్ ఇవ్వాలని ఆమె తరఫు న్యాయవాదులు కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. అయితే, లిక్కర్ స్కాంలో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కవితకు బెయిల్ ఇచ్చే విషయంపై ఈడీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆమె బయటకు వస్తే సాక్ష్యాలు తారుమారు చేసే ప్రమాదం ఉందని రౌస్ ఎవెన్యూ కోర్టుకు తెలిపింది.
ఈ కేసులో మరికొందరిని ప్రశ్నిస్తున్నట్లు ఈడీ కౌంటర్ దాఖలు చేసింది. ఈడీ కౌంటర్‌కు రిజాయిండర్ వేసేందుకు కవిత తరఫు లాయర్లు సమయం కోరారు. దీంతో కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా పడింది.
ఇదిలాఉండగా, ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సౌత్ గ్రూపు నుంచి కీలక సూత్రధారిగా భావిస్తూ కవితను మార్చి 15వ తేదీన ఈడీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అనంతరం రౌస్ అవెన్యూ కోర్టులో ఆమెను హాజరు పరచగా.. తొలుత 7 రోజులు మరోసారి 3 రోజుల పాటు ఈడీ కస్టడీకి కోర్టు అనుమతించింది. కస్టడీ ముగియడంతో ప్రస్తుతం 14 రోజుల పాటు జ్యుడీషియల్ రిమాండ్ కింద కవిత తిహార్ జైలులో జీవనం గడుపుతున్నారు.