షహీద్ వీరంగన మాతంగిని హజరా (Veerangana matangini hazara).. స్వాతంత్ర్య పోరాట ఉద్యమం(Freedom Figther)లో ఈమె ఉక్కు మహిళ పాత్రను పోషించారు.పెద్దగా చదువు లేకపోయినా తన కడసారి సమయంలో ఏకంగా 6 వేల మందితో కూడా సమూహానికి ఆమె నాయకత్వ బాధ్యతలు నిర్వహించారు. నిరసనకారులపై బ్రిటీష్ సైనికులు కాల్పులు జరుపుతుండగా.. వారిని అడ్డుకోవడానికి యత్నించి ఏకంగా స్వయంగా బుల్లెట్లకు ఎదురుగా నిలిచి ప్రాణత్యాగం చేశారు.
షహీద్ మాతంగిని ప్రస్థానం గురించి తెలిస్తే ఎవరికైనా కళ్లు చెమ్మగిల్లుతాయి. చిన్నతనంలోనే ఆమె ఎన్నో కష్టాలను అనుభవించింది. మాతంగిని ప్రస్తుత పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని హోగ్లా గ్రామంలో జన్మించింది.ఆడ కూతురిగా జన్మించినందున కుటుంబీకుల ప్రోత్సాహం లేకపోవడంతో అధికారిక విద్యకు దూరమైంది. తన తండ్రి ఒక పేద రైతు. మాతంగినికి తల్లిదండ్రులు బాల్యవివాహం చేయడంతో 18ఏళ్ల వయసులోనే వితంతువుగా మారింది.
ఆ తర్వాత కొంత కాలానికి తిరిగి తన స్వగ్రామానికి వచ్చింది.తన జీవితాన్ని గ్రామంలోని ప్రజలకు సాయం చేయడానికి వెచ్చించింది. 1900 సంవత్సరం ప్రారంభంలో జాతీయవాద ఉద్యమం భారత ఉపఖండం అంతటా వ్యాపించింది. ఆ సమయంలో మాతంగి స్వాతంత్ర్య ఉద్యమం గురించి తెలుసుకోవడం ప్రారంభించింది. ఈ క్రమంలోనే 1905లో షహీద్ మాతంగి స్వాతంత్ర్య పోరాటంలో చురుకుగా పాల్గొనడం ప్రారంభించారు.
ఆమె అప్పట్లో చాలా బలహీనంగా ఉండేది. ఒంట్లో శక్తి లేకపోయినా స్వాతంత్ర్య ఉద్యమంలో ఆమె కనబరిచిన స్ఫూర్తితో ‘గాంధీ బురి’(వృద్ధ గాంధీ మహిళ) అనే బిరుదును పొందింది. 1932లో సహాయ నిరాకరణ ఉద్యమ సమయంలో ‘ఉప్పు సత్యాగ్రహ’ ఉద్యమంలో కీలక పాత్ర పోషించింది. దీంతో ఆమెను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం విడుదలైన ఆమె ఉప్పు మీద పన్ను(TAX)ను రద్దు చేయాలనే డిమాండ్‌తో ఉద్యమించడం ప్రారంభించింది.
దీంతో మాతంగినిని మళ్లీ అరెస్టు చేసి 6 నెలల పాటు బహరంపూర్‌లో ఉంచారు. అనంతరం 1933లో సెరంపూర్‌లో జరిగిన సబ్ డివిజనల్ కాంగ్రెస్ సమావేశానికి హాజరైన ఆమె పోలీసులు జరిపిన లాఠీచార్జిలో తీవ్రంగా గాయపడింది. ఆ తర్వాతి కాలంలో మాతంగిని అనేక మార్లు అరెస్టు అయ్యి జైలుకు వెళ్లారు.
ఆ తర్వాత షహీద్ హజ్రా జిల్లా రాజధానిలో జరిగిన స్వాతంత్ర్య పోరాటంలో మాతంగిని పాల్గొన్నారు. ఇది ఆమె జీవితాన్ని ఓ మలుపు తిప్పింది. నాయకత్వ లక్షణాలను పునికిపుచ్చుకోవడానికి ఈ ఘటన ఊపిరిపోసిందని చెప్పుకోవచ్చు. గవర్నర్ రాజభవనంను లక్ష్యంగా చేసుకుని నిరసన కారులు మార్చ్‌ను నిర్వహిస్తున్నారు. ఆ టైంలో షహీద్ మాతంగిని స్వాతంత్య్ర పతాకాన్ని చేతబట్టుకుని ఎగురవేస్తూ పరేడ్‌లో ముందుండి సాగారు.
నిరసనకారులు గవర్నర్ బాల్కనీకి చేరువ కావడంతో మాతంగిని ఒక్కసారిగా బ్రిటీష్ సైనికుల నుంచి తప్పించుకుని ‘గో బ్యాక్, లాత్ సాహిబ్’ అని అరుస్తూ బ్యానర్‌ను చూపించారు.ఈ చర్యతో ఆమెను బ్రిటిష్ పోలీసులు తీవ్రంగా కొట్టారు. ఇక 29 సెప్టెంబరు 1942న 73 ఏళ్ల వయస్సులో మాతంగిని దాదాపు 6 వేల మంది నిరసనకారులతో కూడిన బృందానికి నాయకత్వం వహించింది.
ఈ నిరసన కారుల బృందం బ్రిటిష్ అధికారుల చెరలో ఉన్న ‘తామ్లుక్’ పోలీసు స్టేషన్‌ను స్వాధీనం చేసుకున్నారు. అప్పుడు ఆమె నిర్భయత గురించి అందరూ చర్చించుకున్నారు. పోలీసులు ఈ మార్చ్‌ను ఆపడానికి ప్రయత్నించగా, ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. అనంతరం నిరసనకారులపై బ్రిటీష్ సైనికులు కాల్పులు జరపడం ప్రారంభించారు. దీంతో కాల్పులు ఆపాలని మాతంగిని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. ఆమె వినతిని పట్టించుకోకుండా బ్రిటీష్ సైనికులు ఆమె మీద ఏకంగా మూడు సార్లు కాల్పులు జరిపారు. దీంతో నెత్తుడి మడుగులో ఆమె కుప్పకూలి తుదిశ్వాస విడిచింది. స్వాతంత్ర్యం సిద్ధించిన అనంతరం కోల్‌కోతాలోని మైదాన్‌లో ఆమె శిలాశాసనాన్ని ఏర్పాటు చేయడంతో పాటు, ఒక రహదారికి ఆమె పేరు పెట్టారు.