Telugu News » Sangareddy : ఉపాధ్యాయుడి కాళ్లు పట్టుకుని ఏడ్చిన విద్యార్థులు…ఎందుకంటే…

Sangareddy : ఉపాధ్యాయుడి కాళ్లు పట్టుకుని ఏడ్చిన విద్యార్థులు…ఎందుకంటే…

సంగారెడ్డి జిల్లా కంది మండలం ఎద్దు మైలారం ప్రభుత్వ పాఠశాలలో భాస్కర్ హెడ్ మాస్టరుగా విధులు నిర్వహిస్తున్నారు. కొంతకాలంగా విధులు నిర్వహిస్తున్న భాస్కర్ తాజాగా వేరే చోటికి ట్రాన్స్ ఫర్ అయ్యారు.

by Prasanna
Sangareddy Sir

ప్రభుత్వ పాఠశాలల్లో (Govt Schools) పని చేసే ఉపాధ్యాయులకు బదిలీలు సహజంగానే జరుగుతుంటాయి. టీచర్లు (Teachers) కూడా చేసినంత కాలం పని చేస్తారు, ఆ తర్వాత వెళ్లిపోతారు. వారి స్థానంలో కొత్త వారు వస్తారు. ఇదంతా ఎక్కడైనా జరిగేది. కానీ సంగారెడ్డి జిల్లా (Sangareddy Dist) లో మాత్రం ఒక ఉపాధ్యాయుడు బదిలీపై వెళ్తుంటే…మేం కూడా మీతోనే వచ్చేస్తాం సర్…మమ్మల్నితీసుకుపోండి, లేదంటే మీరే ఇక్కడ ఉండిపోండి అంటూ విద్యార్థులు కన్నీళ్లు పెట్టుకున్నారు.

Sangareddy Sir

సంగారెడ్డి జిల్లా కంది మండలం ఎద్దు మైలారం ప్రభుత్వ పాఠశాలలో భాస్కర్ హెడ్ మాస్టరుగా విధులు నిర్వహిస్తున్నారు. కొంతకాలంగా విధులు నిర్వహిస్తున్న భాస్కర్ తాజాగా వేరే చోటికి ట్రాన్స్ ఫర్ అయ్యారు. హెచ్ఎం భాస్కర్ స్కూల్ విడిచి వెళ్తుండగా ‘మీరు వెళ్లొద్దు సర్’ అంటూ విద్యార్థులు కన్నీళ్లు పెట్టుకున్నారు. అతడ్ని చుట్టేసి కదలనివ్వలేదు. ప్లీజ్ సర్…ప్లీజ్, మీరు వెళ్లిపోకండి సర్, ఇక్కడే ఉండండి అంటూ భాస్కర్ చుట్టూ చేరి కన్నీళ్లతో విన్నవించుకున్నారు.

ఇలా విద్యార్థులు వేడుకుంటుంటే హెచ్ఎం భాస్కర్ కూడా కన్నీళ్లు ఆపుకోలేకపోయారు. వారితో పాటే ఆయన కూడా ఏడ్చేశారు. వారందరిని దగ్గరకు తీసుకుని ఒక్కొక్కరికి నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. ‘మరో సర్ వస్తారు, ఆయన మీకు బాగా పాఠాలు చెప్తారు, నా కంటే మంచి సర్ వస్తారంటూ’ ఎన్నో మంచి మాటలు చెప్పే ప్రయత్నం చేశారు. కానీ విద్యార్థులు వినలేదు. మీరే మాకు కావాలి సర్, మీరే ఇక్కడ ఉండిపోండి సర్ అంటూ హెచ్ఎం భాస్కర్ ని విడిచిపెట్టలేదు.

వారందరిని ఓదార్చి భాస్కర్ ఆ స్కూల్ విడిచి పెట్టి రావడానికి ఒక యుద్ధమే చేశారు. భాస్కర్ కూడా విద్యార్థుల ప్రేమ చూసి ఏడుస్తూనే ఉండిపోయారు. మీరందరూ బాగా చదువుకుని భవిష్యత్ లో మంచిగా ఎదగాలని చెప్తూ…ఆయన విద్యార్థులకు ధైర్యం చెప్పారు. తాను చూడడానికి వస్తూనే ఉంటా అని విద్యార్ధులకు మాట ఇచ్చి అక్కడ నుంచి బయలు దేరారు. హెచ్ఎం భాస్కర్ వెళ్తుంటే విద్యార్ధులు ఏడుస్తూనే ఆయనకు విడ్కోలు పలికారు.

You may also like

Leave a Comment