కార్డియాక్ అరెస్ట్ జరిగిన వెంటనే సీపీఆర్ (Cardiopulmonary Resuscitation) చేస్తే ప్రాణాలు కాపాడే అవకాశం ఉందని మంత్రి హరీశ్ రావు (Harish Rao) అన్నారు. అయితే మనదేశంలో 98 శాతం మందికి సీపీఆర్ అంటే ఏంటో తెలియదని చెప్పారు. అందుకే తెలంగాణ ప్రభుత్వం అత్యవసరంగా ఉపయోగపడే సీపీఆర్ ఎలా చేయాలో శిక్షణ ఇస్తున్నదని తెలిపారు.
మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లతో షుగరు, బీపీ స్థాయిలు పెరుగుతున్నాయని ఒక సర్వేలో తేలిందని, రాష్ట్రంలో 24 శాతం షుగర్, 14 శాతం బీపీ కేసులు ఉన్నట్లు నిర్ధారణ అయిందని మంత్రి హరీశ్ రావు అన్నారు. ప్రభుత్వం బీపీ, షుగర్ మందులను ఉచితంగా అందిస్తున్నదని తెలిపారు.
హైదరాబాద్‌లోని తెలంగాణ స్టేట్ చాప్టర్ ఆధ్వర్యంలో నిర్వహించిన వరల్డ్ హార్ట్ డే కార్యక్రమంలో మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. ప్రాథమిక దశలోనే బీపీ, షుగర్‌లను గుర్తించి చికిత్స తీసుకోకపోవడం వల్ల దీర్ఘకాలిక రోగాలకు కారణం అవుతున్నాయన్నారు. వాటివల్ల గుండె, కిడ్నీలు, కాలేయం వంటి ముఖ్యమైన అవయవాలు దెబ్బతింటున్నాయని చెప్పారు.
ఎక్కువగా గుండె సమస్యలకు బీపీ ఒక కారణం అవుతున్నట్లు వైద్యులు చెప్తున్నారని వెల్లడించారు. సడెన్ కార్డియాక్ అరెస్ట్ వల్ల దేశంలో ఏటా సుమారు 15 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు.
సమయం, సందర్భం, చిన్నా, పెద్దా అనే తేడాలేకుండా ఎవరికైనా సడెన్ కార్డిక్ అరెస్ట్ వచ్చే అవకాశం ఉంటుందన్నారు. ఇలాంటి అత్యవసర సమయంలో ప్రాణాలు కాపాడే అతి ముఖ్యమైన సీపీఆర్ విధానం గురించి మనలో చాలా మందికి తెలియదన్నారు. ప్రాణనష్టాన్ని తగ్గించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా సీపీఆర్‌పై అవగాహన కల్పించాలని, శిక్షణ ఇప్పించాలని నిర్ణయించారని వెల్లడించారు.
ఇందులో భాగంగా, పారామెడికల్ సిబ్బందితోపాటు వైద్య, మున్సిపల్ సిబ్బంది, పోలీసు, కమ్యూనిటీ వాలంటీర్లు, ఉద్యోగులు, రెసిడెన్షియల్ అపార్ట్‌మెంట్ల ప్రతినిధులు, సిబ్బంది, కమర్షియల్ కాంప్లెక్స్ వర్కర్స్ ఇలా వివిధ వర్గాలకు చెందిన వ్యక్తులకు సీపీఆర్ మీద శిక్షణ ఇచ్చామన్నారు. దీనికోసం అవసరమైన 1262 ఏఈడీ మిషన్లు సమకూర్చుకుని అన్ని సీహెచ్‌సీలు, యూపీహెచ్‌సీలు, బస్తీ దవాఖానల్లో ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు. గేటెడ్ కమ్యూనిటీల్లో కూడా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసిందన్నారు.