Telugu News » దేవాదాయ శాఖలో.. కమీషన్ల పర్వం..!

దేవాదాయ శాఖలో.. కమీషన్ల పర్వం..!

గతంలో ఇదే స్థల వివాదం పత్రికల్లో రావడంతో తనను కలిసిన పాత్రికేయులతో అసిస్టెంట్‌ కమిషనర్‌ తాము ఎండోమెంట్‌ బోర్డు సర్వేయర్‌ కు ల్యాండ్‌ సర్వే కోసం దరఖాస్తు పెట్టామని, సిబ్బంది కొరత వల్ల సమయం పడుతుందని చెప్పారు. త్వరలోనే రిక్వెస్ట్‌ చేసి సర్వే చేయించి హద్దులు నిర్ణయించి వేలం పాట పాడిన వ్యక్తికి స్థలం కేటాయిస్తామని తెలిపారు.

by admin

– చర్చనీయాంశంగా ఎండోమెంట్ తీరు
– అసిస్టెంట్ కమిషనర్ పై తీవ్ర ఆరోపణలు
– ప్రైవేట్ భూములపై పెత్తనం చేస్తున్నారా?
– కావాలనే సర్వేలను అడ్డుకుంటున్నారా?
– ఖమ్మం నగర శివారులో భూ వివాదం
– అసలేం జరుగుతోంది..?

దేశంలో సర్కారు సర్వేను అదే ప్రభుత్వంలో ఉండే మరో శాఖ అడ్డుకున్న దాఖలాలు లేవు. కానీ, ఖమ్మంలో ఇది జరుగుతోంది. జిల్లా దేవాదాయ, ధర్మాదాయ శాఖ ఓ సర్వేను అడ్డుకుంటోంది. దీంతో దీని వెనుక మర్మం ఏంటనే చర్చ జోరుగా జరుగుతోంది. కమీషన్లకు కక్కుర్తి పడ్డారా..? రౌడీ మూకల బెదిరింపులకు భయపడ్డారా..? అనుమానాస్పదంగా అసిస్టెంట్‌ కమిషనర్‌ సులోచన వైఖరి. ఇలా అనేక ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. ఖమ్మం నగరానికి నడిబొడ్డున ఉన్న ఓ భూ వివాదం విషయంలో సులోచన తీరు వివాదాస్పదంగా మారింది. సమస్య పరిష్కారించాల్సిన ఆఫీసర్ సర్వేకు అడ్డుపడుతుండడం.. పైగా, సమాచార హక్కు దరఖాస్తులకు సైతం ఆన్సర్ ఇవ్వకపోవడం.. అనేక అనుమానాలకు తావిస్తోంది.

అసలేం జరిగింది..?

ఖమ్మం నగర శివారులో శ్రీశ్రీ సర్కిల్‌ దగ్గర సర్వే నెంబర్‌ 504లో మూడు ఎకరాల భూమి కన్సాలాల్‌ సింగ్‌ వారసులకు, ఎండోమెంట్‌ కు మధ్య వివాదం నడుస్తోంది. ఈ భూమికి తూర్పున ఓ ప్రైవేట్‌ భూమి ఉంది. అయితే.. ఓ ముఠా ఈ భూమిని కాజేయాలను కుట్రలు పన్నుతున్నట్టు సమాచారం. ఎండోమెంట్ తమ ఆధీనంలో ఉంది అని చెబుతున్న భూమికి, ఆ ముఠాకు ఉన్న లింకు ఏంటో ఎవరికీ తెలియడం లేదు. ఈ వివాదంలో ఇతరులు ఇబ్బంది పడుతున్నా ఎండోమెంట్ అధికారులకు చీమ కుట్టినట్టు కూడా లేదనే ఆరోపణలు ఉన్నాయి. భూమిని రౌడీ మూకలకు అప్పజెప్పి తమ షేర్‌ తాము దక్కించుకునే ఎత్తుగడలో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.

సమాచార హక్కు చట్టానికి గౌరవం ఏది?

వివాదంలో ఉన్న భూమి ఎండోమెంట్‌ కు ఎలా సంక్రమించిందో సమాచారం ఇవ్వమని జర్నలిస్టులు, ప్రజాసంఘాల వారు ఎన్నో దరఖాస్తులు పెట్టారు. కానీ, అవన్నీ డస్ట్ బిన్ పాలయ్యాయి. సాక్ష్యాత్తూ పట్టాదారు సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేసి రెండు నెలలు దాటి, చెప్పులు అరిగేలా తిరిగినా మౌనమే సమాధానంగా వస్తోంది. ఒక్క పట్టాదారుకే కాదు, ఈ కార్యాలయం నుంచి సమాచారం పొందటం కష్టంగా మారింది. దీంతో ఎండోమెంట్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ సులోచన తీరుపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.

డార్క్ రూంలో ‘ఆక్షన్‌’..!

ఎండోమెంట్‌ తమదిగా చెప్పుకుంటున్న భూమికి ఈ మధ్య వేలంపాట నిర్వహించినట్టు, చౌక బేరానికి దాన్ని కేటాయించినట్టు వార్తలు వచ్చాయి. ఈ విషయమై అసిస్టెంట్‌ కమిషనర్‌ ను జర్నలిస్టులు సంప్రదించగా, వేలం వేసిన మాట వాస్తవమేనని సమాధానం ఇచ్చారు. అయితే.. వేలం పాటకు సంబంధించిన ‘పబ్లిక్‌ నోటీస్‌ ఎక్కడ ప్రచురించారు.? ఎక్కడ అంటించారు..?’ అన్న ప్రశ్నలకు మాత్రం నో ఆన్సర్. ఈ వ్యవహారంలో భారీగా ముడుపులు చేతులు మారినట్టు ప్రచారం జరుగుతోంది. వేలానికి సంబంధించిన సమాచారం ఇవ్వమని సమాచార హక్కు చట్టం కింద ఇచ్చిన దరఖాస్తును యథావిధిగా బుట్టదాఖలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి.

రౌడీ మూకల హల్చల్

వివాదంలో ఉన్న భూమి పక్కన ల్యాండ్ ను తేల్చి ఇచ్చేందుకు పట్టాదారు సర్వే కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఆ భూమి పక్కన ఉన్న ప్రైవేట్‌ వ్యక్తులకు ఏడీ సర్వేయర్‌ నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులు అందుకున్న వారు తమ భూమి వద్దకు చేరుకున్నారు. అదే సమయంలో ఓ ప్రైవేట్‌ ముఠా రంగంలోకి దిగి పక్కనే ఉన్న భూ యజమాని వెంకటరమణ భర్తపై విచక్షణా రహితంగా దాడి చేసింది. ఫోన్‌ లాక్కొని కిడ్నాప్‌ చేసి, బలవంతంగా సంతకాలు పెట్టించుకునేందుకు ప్రయత్నించింది. అక్కడ ఉన్న వ్యక్తులు 100 కి డయల్‌ చేయగా పోలీసులు వచ్చి వెంకటరమణ కుటుంబ సభ్యులను కాపాడారు.

అసిస్టెంట్‌ కమిషనర్‌ అడ్డంగా దొరికిపోయారా?

గతంలో ఇదే స్థల వివాదం పత్రికల్లో రావడంతో తనను కలిసిన పాత్రికేయులతో అసిస్టెంట్‌ కమిషనర్‌ తాము ఎండోమెంట్‌ బోర్డు సర్వేయర్‌ కు ల్యాండ్‌ సర్వే కోసం దరఖాస్తు పెట్టామని, సిబ్బంది కొరత వల్ల సమయం పడుతుందని చెప్పారు. త్వరలోనే రిక్వెస్ట్‌ చేసి సర్వే చేయించి హద్దులు నిర్ణయించి వేలం పాట పాడిన వ్యక్తికి స్థలం కేటాయిస్తామని తెలిపారు. ఇతర ముఠాలకు ఆ భూమితో సంబంధం లేదని తేల్చి చెప్పారు. కానీ, పట్టాదారు సర్వేకోసం దరఖాస్తు చేయగా.. సర్వే జరిపే రోజు యుద్ధ ప్రాతిపదికన దీన్ని వ్యతిరేకిస్తున్నామని, నిలిపివేయమని అధికారికంగా ఆర్‌సీ నెం. డీ/2587/2023 ద్వారా డిప్యూటీ ఇన్‌ స్టెక్టర్‌ కి లేఖ పంపారు. దీంతో ఆ ముఠాల చేతుల్లో ఈమె కీలుబొమ్మగా మారిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

అసిస్టెంట్‌ కమిషనర్‌ కు అవగాహన లేదా?

అసిస్టెంట్‌ కమిషనర్‌ ఇచ్చిన లేఖలో ఎండోమెంట్‌ కు సంబంధం లేని కేసులను ఉదహరించడంతో ప్రైవేట్‌ వ్యక్తులతో కుమ్మక్కైన విషయం తేటతెల్లమైందనే విమర్శలు వినిపిస్తున్నాయి. లేఖలో చెప్పిన దాని ప్రకారం.. ఓఎస్‌ నెం. 1688/2023 కేసు వెంకటరమణ వర్సెస్‌ సాయికి మధ్య భూ వివాదం. ఇందులో తమని పార్టీలుగా చేర్చమని భూమికి సంబంధం లేని వారు వేసిన పిటిషన్‌ పై కోర్టు నిర్ణయం పెండింగ్‌ లో ఉంది. మరో కేసు ఓఎస్‌ నెం. 595/2023. బండి ధర్మాసింగ్‌ కు ముఠాకు చెందిన వ్యక్తిగా చెప్పుకుంటున్న రామనారాయణకు మధ్య వివాదం. ఈ వివాదానికి ఎండోమెంట్‌ బోర్డుకు ఏం సంబంధం అనేది అసిస్టెంట్‌ కమిషనర్‌ సులోచన వివరించాలనే డిమాండ్ పెరుగుతోంది. అసలు ఈ లేఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ రాసారా? లేక, సదరు ముఠా ఇచ్చిందా? అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.

శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారా?

ఎండోమెంట్‌ చాటున సులోచన ఈ భూమి విషయంలో అతిగా స్పందిస్తున్నారనే విమర్శలు ఎక్కువవుతున్నాయి. ట్రైబ్యునల్‌ కేసుల్లో, సివిల్‌ కేసుల్లో వివాదం నలుగుతోందనే విషయాన్ని తానే చట్టబద్దంగా ఒప్పుకున్న ఆమె.. తమకు అనుకూలంగా తీర్పు రాక ముందే వేలంపాట ఎలా నిర్వహించారనే ప్రశ్న వినిపిస్తోంది. కనీసం పట్టాదారుల ప్రాథమిక హక్కులకు భంగం కలుగుతుందనే విషయం కూడా తెలియదా? అని అడుగుతున్నారు బాధితులు. ఇప్పటికైనా అసిస్టెంట్‌ కమిషనర్‌ తన వైఖరిని మార్చుకోవాలని కోరుతున్నారు. లేదంటే, బాధితులందరూ కలిసి కలెక్టర్‌ కు ఫిర్యాదు చేస్తామని చెబుతున్నారు.

You may also like

Leave a Comment