ఇజ్రాయెల్ (israel), హమాస్ ఉగ్రవాదుల మధ్య యుద్ధం జరుగుతోంది. పోరు ఉద్ధృతంగా సాగుతోంది. ఉగ్ర మూకల్ని ఏరి పారేసేందుకు ఇజ్రాయెల్ కు అనేక దేశాలు మద్దతు తెలుపుతున్నాయి. అమెరికా (America) యుద్ధానికి అవసరమయ్యేవి సరఫరా కూడా చేస్తోంది. భారత్ (Bharat), జర్మనీ (Germany) సహా పలు దేశాలు ఇజ్రాయెల్ కు సపోర్ట్ చేస్తున్నాయి. అయితే.. ఈ యుద్ధానికి సంబంధించి టాలీవుడ్ ప్రముఖ రైటర్ అనంత శ్రీరామ్ (Anantha Sriram) వివాదాస్పద పోస్ట్ పెట్టారు.
అనంత శ్రీరామ్ చేసిన పోస్ట్
‘‘ఒక దేశానికి ఇంకో దేశానికి మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు తటస్థంగా ఉండటమో.. ఏదో ఒక దేశానికి మద్దతివ్వడమో చేయొచ్చు. కానీ ఒక దేశానికి, ఒక ఉగ్రవాద సంస్థకి యుద్ధం జరుగుతున్నప్పుడు.. బుద్ధున్నోడెవడైనా ఉగ్రవాద సంస్థకి మద్దత్తిస్తాడా.. మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మీ పార్టీని 6 దశాబ్దాలు భరించడం మా తప్పైపోయింది. ఇక మీదట ఆ అదృష్టం మాకొద్దులే నాయనా’’ అంటూ ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టారు అనంత శ్రీరామ్.
ప్రస్తుతం ఈ పోస్ట్ తెగ వైరల్ అవుతోంది. అనంత శ్రీరామ్ ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారా? అని నెటిజన్లు సోషల్ మీడియాలో తెగ చర్చించుకుంటున్నారు. ఇది ముమ్మాటికీ కాంగ్రెస్ (Congress) పార్టీని టార్గెట్ చేస్తూ చేసిన పోస్ట్ అని కొందరు తేల్చారు. ఎందుకంటే.. ఇజ్రాయెల్ పై హమాస్ చేస్తున్న వికృత చర్యలను ఖండించకుండా కాంగ్రెస్ పార్టీ పాలస్తీనీయుల గురించి వ్యాఖ్యానించడంతో వివాదం చెలరేగింది.
కాంగ్రెస్ వ్యాఖ్యలు హమాస్ కు మద్దతు తెలిపేలా ఉన్నాయని బీజేపీ విమర్శలు చేస్తోంది. ఇది దేశంలోని ముస్లిం ఓటర్లను ఆకర్షించే ప్రయత్నమేనని మండిపడుతోంది. ఇలాంటి సమయంలో అనంత శ్రీరామ్ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ ను టార్గెట్ గా చేసినవేనని అందరూ అనుకుంటున్నారు.