వన్డే వరల్డ్ కప్ టోర్నీ-2023 (Worldcup 2023) లో టీమిండియా కుమ్మేస్తోంది. వరుసగా ఐదో విజయాన్ని నమోదు చేసింది. ఆదివారం ధర్మశాల వేదికగా జరిగిన మ్యాచ్ లో న్యూజిలాండ్ పై గెలుపొందింది. 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అంతేకాదు, పాయింట్ల పట్టికలోకి టాప్ లోకి దూసుకెళ్లింది భారత్.
తొలుత న్యూజిలాండ్ టీమ్ బ్యాటింగ్ చేసింది. డారిల్ మిచెల్, రచిన్ రవీంద్ర మినహా ఎవరూ పెద్దగా రాణించలేదు. కాన్వే(0), విల్ యంగ్ (17) తక్కువ స్కోర్ కే పరిమితమయ్యారు. తర్వాత వచ్చిన రవింద్ర (75), మిచెల్ (130) స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. ముఖ్యంగా మిచెల్ అద్భుతంగా రాణించాడు. రవీంద్ర ఔట్ అయ్యాక మిగిలిన ఆటగాళ్లూ ఎవరూ నిలబడలేదు. దీంతో 50 ఓవర్లలో 273 పరుగులు చేసింది న్యూజిలాండ్.
274 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన భారత్ ఓపెనర్లు దూకుడుగానే ఆడారు. 11 ఓవర్లలో 71 పరుగులు చేశారు. అయితే.. ఫెర్గూసన్ బౌలింగ్ లో రోహిత్ శర్మ (46) ఔటయి పెవిలియన్ బాట పట్టాడు. క్రీజ్ లోకి వచ్చిన కోహ్లీ (95).. గిల్ (26) తో కలిసి స్కోర్ బోర్డును ముందుకు తీసుకెళ్లేందుకు చూశాడు. కానీ, గిల్ ను ఫెర్గూసన్ ఔట్ చేయడంతో జట్టు స్కోర్ ను చక్కదిద్దే బాధ్యతను శ్రేయాస్ అయ్యర్ (33) తో కలిసి తీసుకున్నాడు కోహ్లీ. అయితే.. 22వ ఓవర్ లో బౌల్ట్ వేసిన బంతిని డీప్ స్క్వేర్ లెగ్ మీదుగా పంపాడు శ్రేయాస్, కానీ అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న కాన్వే ముందుకు దూసుకొచ్చి క్యాచ్ పట్టాడు. దీంతో భారత్ మూడో వికెట్ కోల్పోయింది.
33వ ఓవర్ లో శాత్నర్ వేసిన తొలి బంతికి కేఎల్ రాహుల్ (27) ఎల్బీడబ్ల్యూ కాగా.. 34వ ఓవర్ లో బౌల్ట్ వేసిన ఐదో బంతిని కవర్ మీదుగా ఔట్ సైడ్ పంపిన సూర్య కుమార్ (2) సమన్వయ లోపంతో రనౌట్ అయ్యాడు. 191 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది భారత్. ఈ దశలో రవీంద్ర జడేజాతో కలిసి కోహ్లీ ఇన్నింగ్స్ నిర్మించాడు. టీమిండియా విజయానికి 24 బంతుల్లో 19 పరుగులు కావాల్సిన దశలో 6, 4 బాది ప్రేక్షకుల్లో ఉత్సాహాన్ని నింపాడు. విజయానికి 7 పరుగులు కావాల్సిన దశలో సెంచరీకి 7 పరుగుల దూరంలో నిలిచాడు. అయితే.. 2 పరుగులు తీసి భారీ షాట్ కి ప్రయత్నించి ఔట్ అయ్యాడు. తర్వాత, జడేజా, షమీ జట్టును విజయతీరాలకు చేర్చారు. 104 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 95 పరుగులు చేశాడు కోహ్లీ. ఈ విజయంతో టీమిండియా 10 పాయింట్లతో టాప్ లోకి దూసుకెళ్లింది. అంతేకాదు, 20 ఏళ్ల తర్వాత న్యూజిలాండ్ పై ఐసీసీ మ్యాచ్ గెలిచింది టీమిండియా.