రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping Case)కేసులో కీలక పాత్ర పోషించిన అధికారులను ప్రత్యేక విచారణ బృందం విచారిస్తున్న విషయం తెలిసిందే. అయితే, విచారణలో భాగంగా సంచలన విషయాలను పోలీసులు రాబడుతున్నారు. దీంతో ఎస్ఐబీ అధికారుల అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఎస్ఐబీ సస్పెండెడ్ డీఎస్పీ ప్రణీత్ రావు వాంగ్మూలం మేరకు ఉన్నతాధికారులు రాధాకిషన్ రావు, తిరుపతన్న, భుజంగరావులను ప్రత్యేక దర్యాప్తు బృందం ఇప్పటికే అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
ఈ కేసులో ప్రభాకర్ రావు,రాధాకిషన్ రావుల ఆదేశాల మేరకు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో సర్వర్ రూమ్స్ ఏర్పాటు చేసి ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు ప్రణీత్ రావు విచారణలో పేర్కొనగా..ఈ క్రమంలోనే మాజీ ఓఎస్డీ రాధాకిషన్ రావును కస్టడీకి కోరుతూ నాంపల్లికోర్టులో విచారణ అధికారులు పిటిషన్ దాఖలు చేయనున్నారు.
ఇప్పటికే ఈకేసులో నలుగురు అధికారులు అరెస్టు అయ్యారు. వీరిపై టెలిగ్రాఫ్ యాక్ట్ కింద కేసు నమోదు చేసేందుకు విచారణ బృందం కోర్టులో మెమో కూడా దాఖలు చేయగా.. వాదనల అనంతరం నేడు(సోమవారం)నిర్ణయం తీసుకోనుంది.
మరోవైపు అడిషనల్ ఎస్పీలు భుజంగరావు,తిరుపతన్నల విచారణ నాలుగోరోజూ కొనసాగుతోంది. అయితే, ఫోన్ ట్యాపింగ్ కేసులో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రభాకర్ రావు, రాధాకిషన్ రావుల ఆదేశాలతో హైదరాబాద్‌తో సహా మరో ఐదు చోట్ల సర్వర్లను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.నల్గొండ, మహబూబ్నగర్ తో పాటు శివారు ప్రాంతంలో సర్వర్లు ఏర్పాటు చేసి కొందరు వ్యాపారులను బెదిరించి పెద్ద మొత్తం డబ్బులు వసూలు చేసినట్లు తెలిసింది.
ప్రభాకర్ రావు ప్రైవేట్ సైన్యం, రాధా కిషన్ రావు తన దగ్గర ఉన్న సిబ్బందిని రాష్ట్ర వ్యాప్తంగా పంపి సెటిల్మెంట్లు చేసినట్లు విచారణ బృందం గుర్తించింది.
పలువురు వ్యాపారులతో పాటు రాజకీయ నాయకులను బెదిరించి పెద్ద మొత్తంలో వసూళ్లకు పాల్పడగా, దీనిపై పోలీసులు సమగ్ర సమాచారాన్ని సేకరిస్తున్నారు. ప్రణీత్ రావు ఎవరెవరి దగ్గర నుంచి ఎంత మొత్తంలో వసూళ్లకు పాల్పడ్డారో ఆ వ్యాపారులను గుర్తించి విచారణ అనంతరం స్టేట్మెంట్లు రికార్డు చేయనున్నారు.
అంతేకాకుండా ఎస్ఐబీలో పనిచేసిన నలుగురు పోలీసు అధికారుల స్టేట్మెంట్లను రికార్డు చేశారు.ఈ కేసులో చీఫ్‌గా ఉన్న ప్రభాకర్ రావుకి ఆదేశాలు ఎవరు ఇచ్చారు. ఆ కీలక నేతల సమాచారాన్ని పోలీసులు సేకరిస్తున్నారు.అదేవిధంగా రాధాకిషన్‌కి ఆదేశాలిచ్చి పలు సెటిల్మెంట్లు చేయించిన రాజకీయ పార్టీ నేతల సమాచారాన్ని సైతం పోలీసులు సేకరించినట్లు తెలుస్తోంది.