తెలంగాణలో మరో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. ఖమ్మం జిల్లా కామన్ ఎగ్జామినేషన్ బోర్డు ఎస్ఏ-2 పరీక్ష ప్రశ్నాపత్రాలు లీక్(Question papers Leak) అయ్యాయి. వైరాలోని ఖమ్మం రోడ్డులో గల కొణిజర్ల మండలం శాంతినగర్ వద్ద గల మేరి ఇమాక్యులేట్ పాఠశాలలో 6 నుంచి 9వ తరగతి( 6th to 9th class)వరకు ఎస్ఏ-2 పరీక్షకు సంబంధించి తెలుగు, హిందీ ప్రశ్నాపత్రాలు లీక్ అయినట్లు సమాచారం.
అయితే, ఈనెల 15వ తేదీ నుంచి 6నుంచి 9వ తరగతి విద్యార్థులకు ఎస్ఏ-2 ఎగ్జామ్స్ నిర్వహించాల్సి ఉంది. దీనికి సంబంధించిన క్వశ్చన్ పేపర్స్‌ను డిస్ట్రిక్ట్ కామన్ ఎగ్జామినేషన్ బోర్డు తయారు చేసి ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలలకు అందిస్తుంది.
ఇక్కడ జరిగిన పొరపాటు ఏమిటంటే.. ఈనెల 15వ తేదీన జరగాల్సిన ఎస్ఏ-2 పరీక్షలను మేరి ఇమాక్యులేట్ పాఠశాల యాజమాన్యం ఈనెల 8తేదీ నుంచే నిర్వహించింది. దీంతో 6వ తరగతి నుంచి 9వ తరగతి వరకు సంబంధించిన ఎస్-2 తెలుగు, హిందీ పరీక్ష ప్రశ్నా పత్రాలు జిల్లా వ్యాప్తంగా హల్ చల్ చేస్తున్నాయి.
ఈ విషయం తెలిసి జిల్లా విద్యాశాఖ ఒక్కసారిగా షాక్ అయ్యింది. ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన మేరీ ఇమాక్యులేట్ స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకునేందుకు అధికారులు సిద్ధమయ్యారు.తమ పిల్లల భవిష్యత్‌తో ఆడుకుంటున్న మేరీ పాఠశాల యాజమాన్యం పై తగిన చర్యలు తీసుకోవాలని అటు పేరెంట్స్ సైతం డిమాండ్ చేస్తున్నారు.