బాసరల్ ట్రిపుల్ ఐటీలో (BASARA IIIT) మరోసారి విద్యార్థి (SUICIDE)ఆత్మహత్యాయత్నం చేశాడు.పీయూసీ సెకండ్ ఇయర్ చదువుతున్న అర్వింద్ అనే విద్యార్థి హాస్టల్ గదిలో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డగా తోటి విద్యార్థులు గమనించి వెంటనే హాస్టల్ అధికారులు సమాచారం అందించారు.
వారు వెళ్లి అర్వింద్‌ను కిందకు దించి పరిశీలించగా అప్పటికే అతను మృతి చెందాడు. మృతుడి స్వస్థలం సిద్ధిపేట జిల్లా బండారుపల్లిగా గుర్తించారు. అయితే, మృతదేహాన్ని నిర్మల్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే, విద్యార్థి ఆత్మహత్యకు గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామన్నారు.
చదువుల తల్లి సరస్వతి నిలయంగా భావించే బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల వరుస ఆత్మహత్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. గతేడాది ఆగస్టు నెలలో చివరగా బాసర ట్రిపుల్ ఐటీలో ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడింది. ఇప్పటివరకు ఏకంగా 10కి పైగానే విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు.
గతేడాది బీఆర్ఎస్ సర్కార్ హయాంలో తమ సమస్యలు పరిష్కరించాలని బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ఆందోళన చేపట్టగా.. అప్పటి ఐటీ మంత్రి కేటీఆర్ 26 సెప్టెంబర్ 2023న బాసర ట్రిపుల్ ఐటీని విజిట్ చేసి.. వారి సమస్యలు తెలుసుకుని వారితో కలిసి భోజనం చేశారు. ప్రతి 6నెలల కొకసారి తానే స్వయంగా వచ్చి మీ సమస్యలు తెలుసుకుంటానని.. మీరు మాత్రం చదువుమీద ఫోకస్ పెట్టాలని విద్యార్థులకు సూచించారు.తీరా చూస్తే ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా బాసర క్యాంపస్ సమస్యలు ఉండిపోగా.. ప్రభుత్వం మారిపోయింది. ముఖ్యంగా క్యాంటీన్, లెక్చరర్ల కొరత, అపరిశుభ్రత, కుక్కల బెడద, హాస్టల్ నిర్వాహకుల ప్రవర్తనతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది.