స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసు చుట్టూ తిరుగుతున్నాయి ఏపీ రాజకీయాలు. ప్రజల సొమ్ము దోచేస్తే జైల్లో వేయకుండా ఉంటారా? అని వైసీపీ (YCP) అంటుంటే.. ఇది రాజకీయ కక్షతో చేసిందేకానీ.. అసలు, స్కామే జరగలేదనేది టీడీపీ (TDP) వాదన. ఈక్రమంలో నేతల మధ్య డైలాగ్ వార్ ఓ రేంజ్ లో జరుగుతోంది. ఇటు చంద్రబాబు (Chandrababu)కు వరుస షాకులు తగులుతున్నాయి.
ఇప్పటికే హౌస్ రిమాండ్ విషయంలో ఏసీబీ (ACB) కోర్టు చంద్రబాబు పిటిషన్ ను తిరస్కరించింది. రెండు రోజుల విచారణ తర్వాత తీర్పు వెల్లడించారు న్యాయమూర్తి. చంద్రబాబు వయస్సు, ఆరోగ్యం, సెక్యూరిటీ దృష్ట్యా.. ఆయనను హౌస్ రిమాండ్ కు అనుమతించాలని వాదించారు ఆయన తరఫు న్యాయవాదులు. దీనికి అనుమతి ఇవ్వొద్దని వాదించారు సీఐడీ తరపు న్యాయవాదులు. చివరకు చంద్రబాబు హౌస్ కస్టడీ పిటిషన్ ను తిరస్కరించిన కోర్టు.. సీఐడీ వాదనలతో ఏకీభవించింది.
ఇక, చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై బుధవారం హైకోర్టు (High Court) లో విచారణ జరగగా ఈనెల 19కి వాయిదా పడింది. స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో రిమాండ్ ఆర్డర్లు కొట్టేయాలని హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు చంద్రబాబు. ఈ నేపథ్యంలో విచారణ జరిపిన న్యాయస్థానం.. ఈనెల 18 వరకు విచారణ చేపట్టవద్దని ఆదేశించింది. కౌంటర్ దాఖలుకు ఏఏజీ సమయం కోరగా.. అందుకు అంగీకరించింది.
మరోవైపు, మంగళవారం కుటుంబ సభ్యుల పరామర్శ తర్వాత రాత్రి 9.30కి పడుకున్నారు చంద్రబాబు. బుధవారం ఉదయం 4.30 – 5 మధ్యలో నిద్రలేచారు. కాసేపు వాకింగ్ చేసిన అనంతరం మెడిటేషన్ చేశారు. బ్లాక్ కాఫీ తాగుతూ న్యూస్ పేపర్స్ చదివారు. ఆయనకు కేటాయించిన స్నేహా బ్లాక్ లో చిన్నపాటి లైబ్రరీ, ఫ్యాన్, బెడ్ తో పాటు టీవీ ఉన్నాయి. అయితే.. ఆ టీవీలో కేవలం సప్తగిరి ఛానల్ మాత్రమే వస్తుంది.