ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విచ్చల విడిగా హత్యలు, దోపిడీలు, భూకబ్జాలు, బెదిరింపులకు పాల్పడిన గ్యాంగ్ స్టర్ నయీం పేరు ఇంతకాలం తర్వాత మరోసారి తెరపైకి వచ్చింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయ్యాక అప్పటి తెలంగాణ ప్రభుత్వం గ్యాంగ్ స్టర్ నయీంను ఎన్ కౌంటర్ చేయించిన విషయం తెలిసిందే.అతని అనుచరులను ఒక్కొక్కరిగా ఎరివేశారు.
అయితే, గతంలో నయీం అక్రమాస్తులపై తెలంగాణ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. కొంతకాలం సీరియస్ గా దర్యాప్తు జరిపిన పోలీసులు ఉన్నట్టుండి సైలెంట్ అయిపోయారు. పోలీసులు విచారణలో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. నయీం డైరీలో రాసుకొచ్చిన అంశాలు అప్పట్లో తెగ వైరల్ అయ్యాయి.
గ్యాంగ్ స్టర్ వెనుక రాజకీయ నాయకులు, పోలీసులు హస్తం మున్నట్లు ఉన్నతాధికారులు గుర్తించారు. వారిని అడ్డం పెట్టుకుని ఈ గ్యాంగ్ స్టర్ వేల కోట్ల ఆస్తులను పోగెసినట్లు అధికారులు గుర్తించారు.ఎన్ కౌంటర్ జరిగిన సమయంలో నయీం ఇంట్లో పెద్దఎత్తున నగదు కూడా లభ్యమైంది.అయితే, నయీం ఆస్తులు, అతని అక్రమంగా దోచిన భూములు, నగదు అంతా ఎవరి చేతుల్లోకి వెళ్లాయనేది ఇప్పుడు చిక్కుప్రశ్నగా మారింది.
విచారణ పేరుతో బీఆర్ఎస్ నేతలు నయీం అక్రమాస్తులను గాజేశారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ వి హనుమంతరావు, తాజాగా కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ నయీం అక్రమాస్తుల కేసును రీఓపెన్ చేయించాలని డిమాండ్ చేశారు. అదే జరిగితే పెద్ద ఎత్తున అప్పటి ప్రభుత్వంలోని కీలక నేతలు జైలుకు వెళ్తారని బండి సంజయ్ ఆరోపించారు.