బీజేపీ రాజ్యసభ సభ్యులు కే.లక్ష్మణ్(K.Laxman) బీఆర్ఎస్(BRS), కాంగ్రెస్(Congress) పార్టీలపై సంచలన విమర్శలు చేశారు. బుధవారం హైదరాబాద్‌లోని నాంపల్లి పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల వ్యవహార శైలి టామ్ అండ్ జెర్రీలా ఉందన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచేందుకు ఈ పార్టీలు రాజకీయ డ్రామాకు తెరలేపాయన్నారు. బీజేపీ(BJP) నేరుగా ఎదుర్కొనే ధైర్యం లేక ప్రజల దృష్టిని మళ్లిస్తున్నారని ఫైర్ అయ్యారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక కాళేశ్వరంపై దర్యాప్తు, ధరణి పై విచారణ, డ్రగ్స్ కట్టడి పేరిట ఉపన్యాసాలు ఇచ్చారని, ఆ తర్వాత చేతులెత్తేసిందని ఆరోపించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోందన్నారు. దేశ భద్రత,వ్యక్తుల ప్రైవసీ,స్వేచ్ఛను హరించే విధంగా ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్నారు. దుబ్బాక, మునుగోడు,హుజూరాబాద్ ఉప ఎన్నికలలో ప్రతిపక్ష నేతల ఫోన్లను ట్యాప్ చేశారని దర్యాప్తులో తేలిందన్నారు.
సీఎం రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే ట్యాపింగ్‌పై పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలి. సీబీఐ విచారణకు ఆదేశాలివ్వాలన్నారు.ట్యాపింగ్ ద్వారానే ఓటుకు నోటు కేసు బయటకు వచ్చిందని రేవంత్ రెడ్డికి తెలుసన్నారు.ఈ విషయంలో రేవంత్ ఎందుకు వెనకడుగు వేస్తున్నారు? దీనిపై త్వరలోనే రాష్ట్ర గవర్నర్‌ను కలుస్తాం.ట్యాపింగ్‌పై సీబీఐతో విచారణ జరిపించాలని గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తామని లక్ష్మణ్ తెలిపారు.
పదేళ్ల బీజేపీ పాలనలో దేశం అభివృద్ధి దిశగా దూసుకెళ్తుందని, బీజేపీ పాలిత ప్రాంతాల్లో పెట్రోల్ ధరలు తగ్గించామని గుర్తుచేశారు. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పెట్రోల్, డీజిల్‌పై ఒక్క రూపాయి ఐనా తగ్గించారా? అని ప్రశ్నించారు.కేటీఆర్ ముసుగు తీసి చర్చకు రావాలని పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ అత్యధిక ఎంపీ స్థానాలను గెలుచుకోబోతుందన్నారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. మోడీ ప్రధాని అవుతారా? రాహుల్ అవుతారో చెప్పాలని సవాల్ విసిరారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అనే నినాదంతో వెళ్లి కాంగ్రెస్ పార్టీ లబ్ది పొందింది. ఇప్పుడు అలా అంటే కుదరదని బీజేపీ సీనియర్ నేత, రాజ్యసభ మెంబర్ లక్ష్మణ్ స్పష్టంచేశారు.