ఇవాళ ప్రారంభం కావల్సిన తెలుగుదేశం పార్టీ (TDP) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) యువగళం (Yuvagalam) పాదయాత్ర వాయిదా పడింది. ఇవాళ రాజోలు నియోజకవర్గంలో రాత్రి 8.15 గంటలకు ప్రారంభం కావాల్సి ఉండగా, వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.
చంద్రబాబు నాయుడు అరెస్టు అనంతరం సెప్టెంబర్ 9న కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలో నారా లోకేష్ పాదయాత్ర నిలిపివేసిన విషయం తెలిసిందే. 20 రోజుల తర్వాత సెప్టెంబరు 29న రాత్రి 8.15 గంటలకు పాదయాత్ర తిరిగి ప్రారంభించాలని లోకేష్ భావించారు. ఎక్కడ నిలిపివేశారో, అక్కడ నుంచే మొదలు పెట్టాలని నిర్ణయించారు.
అయితే, అక్టోబర్ 3న స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసుకి సంబంధించి సుప్రీం కోర్టులో వాదనలు ఉన్నందున యువగళం పాదయాత్రను వాయిదా వేసుకోవాలని పార్టీ ముఖ్య నేతలు లోకేష్‌కు సూచించారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టైన చంద్రబాబు నాయుడు 19 రోజులుగా రాజమండ్రి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. టీడీపీ శ్రేణులు, అభిమానులు ఆయన విడుదల అవుతారని ఎదురుచూస్తుండగా.. మరికొన్ని కేసులు తెరపైకి వచ్చాయి.
ఈ నేపథ్యంలో ఢిల్లీలో న్యాయవాదులతో లోకేష్ సంప్రదింపులు చేయాల్సిన అవసరం ఉంటుందని.. పాదయాత్రలో ఉంటే న్యాయవాదులతో సంప్రదింపులు, ఇతర కార్యక్రమాల పర్యవేక్షణ కష్టం అవుతుందని పార్టీ సీనియన్ నేతలు లోకేష్‌కు సూచించారు. వారి సూచన మేరకు లోకేష్.. యువగళం పాదయాత్ర తేదీని వాయిదా వేసుకోవాలని నిర్ణయించారు. అక్టోబర్ 3 తర్వాత లోకేష్ పాదయాత్ర తేదీలను ప్రకటించే అవకాశముందని పార్టీ వర్గాలు చెప్తన్నాయి.