ఒకప్పటి బాలీవుడ్ సన్సేషన్ వహీదా రెహమాన్ (Waheeda Rehman) ను దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వరించింది. పద్మశ్రీ, పద్మభూషన్ లాంటి మేటి అవార్డులను ఇప్పటికే అందుకున్న వహీదాను తాజాగా కేంద్ర ప్రభుత్వం దాదాసాహెబ్ ఫాల్కే (Dadasaheb Phalke) అవార్డుకు ఎంపిక చేసినట్లు కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రకటించారు.
1938 ఫిబ్రవరి 3న తమిళనాడులోని చెంగల్పట్టులో వహీదా జన్మించారు. చిన్నప్పటి నుంచీ చదువుతోపాటు నాట్యంలోనూ ముందుండే వహీదాకు డాక్టర్ కావలనే కోరిక ఉండేదనీ వహీదా రెహమాన్ చెప్పారు. అయితే కుటుంబ పరిస్థితుల రీత్యా డాక్టర్ కలను మధ్యలోనే వదిలేసి సినిమారంగంలోకి అడుగుపెట్టాని అన్నారు.
తెలుగు, హిందీ, మరాఠీ సినిమాల్లో నటించి మెప్పించిన ఈ స్టార్ హీరోయిన్ తెలుగు సినిమా ‘రోజులు మారాయి’తో ఆరంగేట్రం చేశారు. 1955లో ఎన్టీఆర్ సొంత సంస్థలో తెరకెక్కిన ‘జయసింహ’ అనే సినిమాలో రాజకుమారి పాత్రలో వహీదా నటించారు. బంగారు కలలు, సింహాసనం, చుక్కల్లో చంద్రుడు వంటి సినిమాల్లో ఆమె కనిపించారు.
వహీదా ‘సీఐడీ’ సినిమాతో బాలీవుడ్లో ప్రవేశించారు. ‘ప్యాసా’, ‘గైడ్’, ‘కాగజ్ కే ఫూల్’, ‘ఖామోషి’, ‘త్రిశూల్’ వంటి చిత్రాల్లో నటించారు. అయిదు దశాబ్దాల పాటు సుమారు తొంభై సినిమాల్లో నటించిన వహీదా రహమాన్ నటనకి దేశవ్యాప్తంగా ఇప్పటికీ అనేకమంది అభిమానులున్నారు.