జ్ఞానవాపి మసీదు (Gyanvapi Mosque) వివాదంపై ఏఐఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ (Asaduddin Owaisi) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక నుంచి హిందువుల కోసం ముస్లిం పక్షం ఏ ఒక్క మసీదును కూడా వదులుకోరని స్పష్టం చేశారు. ఆ వివాదాలపై న్యాయస్థానాలలో ముస్లింలు న్యాయ పోరాటం చేస్తారని వెల్లడించారు.
ఒక వేళ అవతలి పక్షం వాళ్లు డిసెంబర్ 6 తరఫు ఘటనను పునరావృతం చేస్తామంటే ఏం జరుగుతుందో చూడాలన్నారు. తాము ఇప్పటికే ఒక సారి మోస పోయామని చెప్పారు. మరోసారి మోసపోయేందుకు తాము రెడీగా లేమని స్పష్టం చేశారు. జ్ఞాన్వాపీ కేసులో సెటిల్మెంట్కు వచ్చే అవకాశాల గురించి మీడియా ప్రశ్నకు సమాధానం ఇస్తూ…..
అది అంతం కాదని తాము ఖచ్చితంగా చెబుతున్నామని అన్నారు. తాము దానిపై న్యాయపరంగా పోరాటం చేస్తామని వివరించారు. తమ వద్ద ఉన్న పత్రాలు, టైటిల్ సూట్లను న్యాయస్థానాలకు చూపిస్తామని వెల్లడించారు. జ్ఞానవాపిలో తాము నమాజ్ చేస్తున్నామన్నారు. బాబ్రీ మసీదు కేసులో ముస్లింలు అక్కడ నమాజు చేయడం లేదని వాదన ఉందన్నారు.
కానీ జ్ఞానవాపిలో తాము చాలా దశాబ్దాలుగా ప్రార్థనలు చేస్తున్నామని వివరించారు. వాస్తవానికి 1993 నుండి పూజలు చేయలేదన్నారు. జ్ఞాన్ వాపీ కాంప్లెక్స్ కింద హిందూ కట్టడాలు ఉన్నట్లు ఏఎస్ఐ నివేదిక చెప్తోందన్న మీడియా ప్రశ్నకు బదులిస్తూ…. రేపు రాష్ట్రపతి భవన్‌ను తవ్వడం ప్రారంభిస్తే, అక్కడ కూడా ఏదైనా బయపడ వచ్చన్నారు. తాము వందల సంవత్సరాలుగా ఆ స్థలంలో నమాజ్ చేస్తున్నామన్నారు.