Rahul Gandhi : విపక్షాల అవిశ్వాస తీర్మానంపై నిన్న లోక్ సభలో జరిగిన చర్చ సందర్భంగా తన ప్రసంగం ముగించిన తరువాత కాంగ్రెస్ (Congress) నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఫ్లయింగ్ కిస్ ఇచ్చిన ఉదంతం దుమారాన్ని రేపింది. సభ నుంచి వెళ్ళిపోతూ ఆయన కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ వైపు ఇలా ‘సౌహార్ద సూచన’గా వ్యవహరించారే తప్ప .. ఇందులో అసభ్యత ఏమీ లేదని శివసేన (ఉద్దవ్) నేత, ఎంపీ ప్రియాంక చతుర్వేది (Priyanka Chaturvedi) సమర్థించారు. అభిమానంతో ఆయన చేసిన ఈ పనికి ఎందుకు వంకలు పెడుతున్నారని ఆమె ప్రశ్నించారు. రాహుల్ మాట్లాడుతున్నప్పుడు మంత్రులంతా నిలబడి గందరగోళ పరిస్థితులు సృష్టించారని, ఆ సమయంలో ఆయన అభిమాన సూచనగా ఇలా ప్రవర్తించారని, ఇందులో సమస్య ఏముందన్నారు.
ప్రేమ లేదా అభిమానం అంటే మీకెప్పుడూ ద్వేషమేనని ఆమె పరోక్షంగా స్మృతి ఇరానీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీని సభ్యత్వానికి అనర్హునిగా చేసినప్పటికీ న్యాయపోరాటం చేసి గెలిచారని, ఆయన వ్యాఖ్యలు ఎవరినీ కించపరచేట్టు గానీ, ద్వేష పూరితంగా గానీ లేవన్నారు. ‘ఎంపీగా సభ్యత్వానికి మీరు ఆయనను అనర్హుడిని చేశారు.. తన నివాసం నుంచి ఆయనను వెళ్లగొట్టారు.. కానీ తన కేసుల్లో గెలిచి తిరిగి తన సభ్యత్వాన్ని పునరుద్ధరించుకున్నారు.. కానీ ఇప్పటికీ రాహుల్ మీ పట్ల ద్వేష భావాన్ని ప్రదర్శించలేదు.. మీకేదయినా సమస్య ఉంటే అది మీకు సంబంధించినదే. అంతే తప్ప మరెవరిదీ కాదు’ అని ప్రియాంక చతుర్వేది పేర్కొన్నారు.
పార్లమెంటులో రాహుల్ ప్రవర్తన చాలా హేయంగా ఉందంటూ పలువురు బీజేపీ మహిళా ఎంపీలు స్పీకర్ కి ఫిర్యాదు చేశారు. రాహుల్ స్త్రీ ద్వేషి అని, భారత పార్లమెంట్ చరిత్రలో ఇలాంటి సంఘటన ఎన్నడూ జరగలేదని స్మృతి ఇరానీ మండిపడ్డారు.
మరి ‘ఆయన ‘ సంగతేమిటి ?
ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మలివాల్ (Swati Maliwal) కూడా పరోక్షంగా రాహుల్ ని సమర్థించారు. ఫ్లయింగ్ కిస్ ఇస్తూ రాహుల్ తన పట్ల అనుచితంగా ప్రవర్తించారన్న స్మృతి ఇరానీ ఆరోపణను ఆమె ప్రస్తావిస్తూ ..దీనిపై ఎందుకింత రాధ్ధాంతం చేస్తున్నారని ప్రశ్నించారు. సభలో రెండు వరసల వెనుక కూర్చున్న బ్రిజ్ భూషణ్ (Brij Bhushan) అనే ఆయన మహిళా ఒలింపిక్ రెజ్లర్ల పట్ల అత్యంత అసభ్యంగా, అశ్లీలంగా ప్రవర్తించలేదా ? వారిని తన రూమ్ కి పిలిచి లైంగికంగా వేధించలేదా అని స్వాతి మలివాల్ ప్రశ్నించారు.
ఆయన చేసిన పనికి మీకు కోపమెందుకు రాలేదన్నారు. బీజేపీ ఎంపీ, రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ పదవి నుంచి త్వరలో వైదొలగనున్న బ్రిజ్ భూషణ్ తమను లైంగికంగా వేధించాడని కొందరు మహిళా రెజ్లర్లు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖకు లోగడ ఫిర్యాదు చేశారు. ఆయనను అరెస్టు చేయాలని, పదవి నుంచి తొలగించాలని కోరుతూ ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద నెలరోజులపైగా ధర్నా చేశారు. పోలీసులు ఆయనపై రెండు కేసులు కూడా పెట్టి కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. అయితే బ్రిజ్ భూషణ్ కి బెయిల్ లభించింది.