అసెంబ్లీ సమావేశాలు చివరి రోజు ఎమ్మెల్యే రాజాసింగ్(MLA Rajasingh) చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. అసెంబ్లీలో మాట్లాడిన ఆయన.. ప్రస్తుత ప్రభుత్వం గోషామహల్(Gosha Mahal) నియోజకవరంపై నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. నియోజకవర్గంలోని సమస్యలు, తన పరిధిలో లేని పనులు, ప్రభుత్వం చేయాల్సిన వాటిపై ఎన్నిసార్లు చెప్పినా స్పందించడం లేదని అన్నారు.
వచ్చే సభలో తాను ఉండొచ్చు.. ఉండకపోవచ్చు.. ఏ ప్రభుత్వం ఉన్నా గోషామహల్ ను అభివృద్ధి చేయాలని కోరారు. తాను ఓడిపోవాలని సొంత పార్టీవాళ్లు, అవతలి పార్టీల వాళ్లు కోరుకుంటున్నారని అన్నారు రాజాసింగ్. ధూల్ పేట్ అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ కట్టుబడి ఉంటానని చెప్పి మాట తప్పారని ఆరోపించారు. రాజాసింగ్ చేసిన ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
గతేడాది వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ రాజాసింగ్ పై బీజేపీ అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసింది. క్రమశిక్షణా చర్యల కింద పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. గతేడాది ఆగస్టు 23న సస్పెన్షన్ వేటు వేసింది. శాసనసభాపక్ష పదవి నుంచి కూడా తొలగించింది. అప్పటి నుంచి ఆయనను పార్టీ కార్యకలాపాలకు దూరంగా పెడుతూ వస్తోంది. ఇదే క్రమంలో ఆయన మంత్రి హరీష్ రావును కలవడం హాట్ టాపిక్ గా మారింది. పార్టీ మారుతున్నారని తెగ చర్చ జరిగింది.
ఈ వార్తలను రాజాసింగ్ ఖండించారు. కేవలం, నియోజకవర్గ అభివృద్ధి కోసమే కలిశానని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో బీజేపీని వీడనని చెప్పారు. ఈ పరిణామాల నేపథ్యంలో తాజాగా అసెంబ్లీలో రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు అనేక అనుమానాలకు తావిస్తున్నాయని పలువురు అంటున్నారు.