ఈ దసరా నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశ పెట్టనున్న అల్పహార పథకం (Breakfast Scheme) ప్రారంభమయ్యే సూచనలు కనిపించడం లేదు. దీనికి కారణం మధ్యాహ్న భోజన పథక కార్మికులు (Mid Day Meals) రేపట్నుంచి సమ్మెకు సిద్ధం కావడమే. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 27,147 ప్రభుత్వ పాఠశాలల్లో 23 లక్షల విద్యార్థులకు (Students) లబ్ధి చేకూర్చేందుకు ఇప్పటికే బ్రేక్ ఫాస్ట్ స్కీమ్ ప్రతిపాదిత మెనూ కూడా విడుదలైంది.
అయితే పాఠశాలల్లో వంట చేసే సిబ్బందికి పాత బకాయిలు, వేతన సవరణ, ఉద్యోగ భద్రత తదితర డిమాండ్లు ఇంకా పరిష్కరం కాలేదు. కార్మికులకు గౌరవ వేతనం ప్రస్తుతం ఉన్న రూ. వెయ్యికి మరో రూ. 2 వేలు కలిపి మొత్తంగా రూ.3 వేలు ఇస్తామని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించారు. కానీ, నేటికీ కార్మికుల ఖాతాల్లో జమ కాలేదని కార్మిక సంఘం నాయకులు తెలిపారు. అలాగే ఫిబ్రవరి 3, 2023న జీవో 8 విడుదల ద్వారా బకాయిలకు సంబంధించి బడ్జెట్ కేటాయిస్తున్నట్టు ప్రకటించినప్పటికీ అమలు కాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం బ్రేక్ ఫాస్ట్ పథకం అమలుకు సన్నద్ధమవుతుండటంతో సాధ్యాసాధ్యాలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పథకం అమలుకు సంబంధించి అదనపు సిబ్బంది, మౌలిక సదుపాయాలు సరిపోతాయా అనే పలు సమస్యలు సైతం వెంటాడుతున్నాయి.
మిడ్ డే మీల్స్ కు తోడు అల్పాహారం పథకం మొదలైతే ప్రస్తుత ఖర్చులో కనీసం నాలుగో వంతైనా పెట్టాల్సి వస్తుంది. ఈ సమస్యల నడుమ ప్రభుత్వం పెండింగ్ బకాయిలు విడుదల చేయాలని, లేదంటే సమ్మె తప్పదని కార్మిక సంఘాలు ప్రకటించాయి. దీంతో బ్రేక్ ఫాస్ట్ స్కీము అమలు అవుతుందా అనేది అనుమానమే.