తెలంగాణ (Telangana) ప్రభుత్వం ఈ నెల ఆరో తేదీ నుంచి మరో పధకాన్ని ప్రభుత్వ పాఠశాలల్లో (Govt Schools) అమలు చేయనుంది. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఉదయం అల్పహారాన్ని అందించే ఈ పధకం పేరు ‘ముఖ్యమంత్రి అల్పాహార పథకం’ (Breakfast Scheme). ఇది మధ్యాహ్న భోజన పధకానికి కొనసాగింపుగా ఉంటుందని, రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ముఖ్యమంత్రి అల్పాహార పథకాన్నివిజయవంతం చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశించారు.
తెలంగాణలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక ప్రభుత్వ పాఠశాలను అల్పాహార పథకం ప్రారంభానికి గుర్తించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. అల్పాహార పథకం ప్రారంభించే సమయంలో స్థానిక ప్రజాప్రతినిధులు చురుగ్గా పాల్గొనేలా తగు ఏర్పాట్లు చేపట్టాలని సీఎస్ అన్నారు. పట్టణ కేంద్రాల్లో అల్పాహార పథకాన్ని అక్షయ పాత్ర ఫౌండేషన్ అమలు చేస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఈ పథకాన్ని స్వయం సహాయక సంఘాలు తీసుకుంటాయి.
ఇదిలా ఉంటే అల్పాహారం పేరుతో ఇప్పటికే తమిళనాడులో ఓ పథకం ఉంది. ఈ పథకం తీరు తెన్నులు తెలుసుకోవాలని కొందరు ఐఏఎస్ ఆఫీసర్స్ తమిళనాడు వెళ్లి పరిశీలించారు. ఈ పధకం అమలు తీరుపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేసి తమ నివేదికను ప్రభుత్వానికి అందజేశారు. తమిళనాడులో కేవలం ప్రాథమిక పాఠశాల వరకు మాత్రమే బ్రేక్ ఫాస్ట్ అందిస్తుండగా తెలంగాణ మాత్రం ప్రాథమిక పాఠశాలలతో పాటు ఉన్నత పాఠశాల విద్యార్థులకు సైతం అందించాలని నిర్ణయించింది. అల్పాహార పథకం అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం దాదాపు రూ. 400 కోట్లు ఖర్చు చేయనుంది.
విద్యార్థులకు అల్పహారంలో భాగంగా సోమవారం – గోధుమ రవ్వ ఉప్మా, చట్నీ…మంగళవారం – బియ్యం రవ్వ కిచిడి, చట్నీ… బుధవారం – బొంబాయ్ రవ్వ ఉప్మా, సాంబార్…గురువారం – రవ్వ పొంగల్, సాంబార్…శుక్రవారం – మిల్లెట్ రవ్వ కిచిడి, సాంబార్…శనివారం – గోధుమ రవ్వ కిచిడి, సాంబార్ అందించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అల్పహార పథకం 23,05,801 మంది విద్యార్థులకు వర్తింప జేయనున్నారు. రంగారెడ్డి జిల్లాలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ పథకాన్ని ప్రారంభిస్తారు.