వాళ్లు చేసేది దొంగతనమే..కాకపోతే వాళ్లకు జనం సైకాలజీ(Psychology)బాగా తెలుసు. వాళ్లు కత్తులు కటారుల్లాంటివేవీ వాడరు. ఎదుటి వారి భయాన్ని, అమాయకత్వాన్ని ఆయుధంగా వాడతారు.ఆదమరిస్తే అంతే..సంగతులు.! తాజాగా ఓ దొంగ ప్రయాణికుడిలా క్యాబ్ బుక్ చేసి ఏకంగా క్యాబ్ నే కొట్టేసిన ఘటన హైదరాబాద్ పటాన్ చెరువు(Pataan cheruvu) ప్రాంతంలో జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా గంగాపూర్ గ్రామానికి చెందిన నరేష్ తన కారును జహీరాబాద్(Zaheerabad)లో కిరాయికి నడుపుతున్నాడు. ఈ క్రమంలో అతని దగ్గరకి గుర్తు తెలియని వ్యక్తి వచ్చి.. సంగారెడ్డి ఉమెన్ పోలీస్ స్టేషన్లో పని ఉందని.. కారు కిరాయికి మాట్లాడుకున్నాడు.
వివరాలు అడగగా.. మహారాష్ట్ర(Maharashtra)కు చెందిన క్రైం బ్రాంచ్ పోలీస్గా పరిచయం చేసుకున్నాడు. దీంతో సంగారెడ్డి ఉమెన్ పోలీస్ స్టేషన్ ముందు ఆపి లోపలికి వెళ్లి వచ్చాడు. దీంతో పాటు ఎస్పీ కార్యాలయం వరకూ వెళ్లి అక్కడ ఫోన్ మాట్లాడాడు.
ఇవన్ని గమనించిన క్యాబ్ డ్రైవర్ నిందితుడు నిజంగానే పోలీస్ అని నమ్మేశాడు. అనంతరం నిందితుడు తనను హైదరాబాద్లో దింపాలని డ్రైవర్కి చెప్పాడు. దీనికి అదనంగా రూ.3వేలు ఇవ్వాలని నరేష్ కోరితే.. ఇస్తానని చెప్పాడు.హైదరాబాద్ వస్తున్న మార్గంలో పటాన్ చెరువు మండలం రుద్రారం గ్రామ శివారులో ఉన్న హోటల్ దగ్గర కారు ఆపి.. డ్రైవర్ని బిర్యాని తీసుకురమ్మని పంపించాడు.
దీంతో బాధితుడు బిర్యానీ తెచ్చాడు..ఆపై మరో మూడు బిర్యానీలు తెమ్మని రూ.1000 ఇచ్చాడు. డ్రైవర్ ఈసారి హోటల్లోకి వెళ్లి.. బిర్యానీ తెచ్చే లోపు నిందితుడు కారుతో సహా పరారైయ్యాడు. దీంతో షాక్కు గురైన డ్రైవర్ తమ అసోసియేషన్ వాట్సాప్ గ్రూప్లో తన కారు ఎక్కడైనా ఉంటే తెలియజేయాలని సందేశాన్ని షేర్ చేశాడు.
సికింద్రాబాద్లో చూసామని.. కారులో ముగ్గురు వ్యక్తులు ఉన్నారని తోటి క్యాబ్ డ్రైవర్లు చెప్పారు. దీంతో పటాన్చెరు పోలీస్ స్టేషన్లో బాధితుడు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు జహీరాబాద్లో ఉన్న హోటల్ గది కోసం ఇచ్చిన ఆధార్ కార్డు వివరాల ఆధారంగా అభినాష్ ప్రకాష్(Abhinash Prakash Shinde) షిండే అని పోలీసులు గుర్తించారు.