– ఎన్నికలొస్తే చాలు కొత్త బిచ్చగాళ్లు వస్తారు
– 50 ఏళ్లు కాంగ్రెస్ చేసిందేంటి?
– మెడికల్ కాలేజీలు పెట్టాలని ఆలోచించిందా?
– సూర్యాపేట, నల్గొండ గతంలో ఎలా ఉన్నాయి?
– ఇప్పుడెలా ఉన్నాయి..?
– కాంగ్రెస్ రాష్ట్రాల్లో 4వేల పెన్షన్ ఎందుకివ్వడం లేదు?
– ఓట్లు, ఎలక్షన్లు రాగానే ఆగమాగం కావొద్దు..
– మనకు కులం లేదు.. జాతి లేదు.. మతం లేదు..
– అందర్నీ కడుపులో పెట్టుకుని కాపాడుకుంటున్నాం
– సూర్యాపేట ప్రగతి నివేదన సభలో సీఎం కేసీఆర్
కాంగ్రెస్ కు 50 ఏళ్లు అవకాశం ఇస్తే ఏం చేశారని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. సూర్యాపేట జిల్లాలో పర్యటించిన సీఎం.. నూతనంగా నిర్మించిన జిల్లా ఎస్పీ, కలెక్టరేట్, వైద్య కళాశాలతో పాటు మార్కెట్ యార్డ్, బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం బహిరంగ ప్రగతి నివేదన సభలో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. ఓట్లు, ఎలక్షన్లు రాగానే ఆగమాగం కావొద్దని ప్రజలకు సూచించారు. ఎన్నికలు రాగానే పంట కల్లాలకు అడుక్కునేటోళ్లు వచ్చినట్టు వస్తారని.. జాగ్రత్తగా ఉండాలని సలహా ఇచ్చారు. 50 ఏండ్లలో కాంగ్రెస్, బీజేపీ ఎందుకు అభివృద్ధి చేయలేకపోయాయని ప్రశ్నించారు. ఇవి మనకు తెలియని పార్టీలా? లేక ఈ మధ్య ఏమైనా ఆకుపసరు తాగొచ్చారా? అని ప్రశ్నించారు.
ఒక్క అవకాశం కావాలని అడుగుతున్నారని.. ఎన్ని అవకాశాలు ఇవ్వాలని మండిపడ్డారు. ‘‘నా కంటే దొడ్డు, ఇంక పొడువు ఉన్నోళ్లు ఎంతోమంది ముఖ్యమంత్రులు అయ్యిండ్రు. ఈ జిల్లా నుంచి కూడా మంత్రులు అయ్యిండ్రు. ఎన్నడైనా సూర్యాపేటలో మెడికల్ కాలేజీ పెట్టాలి. నల్గొండలో మెడికల్ కాలేజీ పెట్టాలి. భువనగిరిలో మెడికల్ కాలేజీ పెట్టాలే అని ఆలోచన చేసిండ్రా. మరి, వాళ్లకు ఎందుకు ఓటు వెయ్యాలి’ అని ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు కేటీఆర్. నల్గొండ మునుపు ఎట్లుండే.. ఇప్పుడెట్ల అయ్యిందో ఆలోచించాలని ప్రజలకు సూచించారు.
కాంగ్రెస్ గెలిచిన కర్ణాటకలో అప్పుడే విద్యుత్ కోతలు మొదలయ్యాయని ఎద్దేవ చేశారు సీఎం. పింఛను పెంచుతామని చెబుతున్న ఆపార్టీ.. తాను పాలిస్తోన్న రాష్ట్రాల్లో ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. హైదరాబాద్ విశ్వనగరంగా మారుతోందని తెలిపారు. పరిశ్రమలు వస్తున్నాయి, ఈ అభివృద్ధి, సంక్షేమం ఇలాగే కొనసాగాలంటే మళ్లీ బీఆర్ఎస్ గెలవాలని అన్నారు. ‘‘సూర్యాపేటలో నాలుగు సీట్లు గెలవడం ఖాయం. మరోసారి బీఆర్ఎస్ గెలుస్తుంది. ఎవరెన్ని చెప్పినా, ఇంకా సీట్లు పెరుగుతాయి తప్ప తగ్గవు’’ అని చెప్పుకొచ్చారు.
సూర్యాపేట పట్టణం మరింత అభివృద్ధి చెందాలంటే ఇక్కడ కొత్తగా కొన్ని రోడ్లు కావాలని మంత్రి జగదీశ్ రెడ్డి తనను కోరినట్లుగా సీఎం ప్రస్థావించారు. ఆ కోరిక మేరకు మిగతా 4 మున్సిపాలిటీలకు రూ.25 కోట్ల చొప్పున.. ప్రత్యేకంగా రూ.50కోట్లు మంజూరు చేస్తున్నామని తెలిపారు. మహిళా పాలిటెక్నిక్ కాలేజీ కావాలని అడిగారని.. దాన్ని కూడా త్వరలోనే మంజూరు చేస్తానని అన్నారు సీఎం కేసీఆర్.