మొన్నటి వర్షాలు, వరదలకు రాష్ట్రంలో చాలామంది నష్టపోయారు. రైతులు, లోతట్టు గ్రామాల ప్రజలు సర్వం కోల్పోయారు. కానీ, సహాయక చర్యలు, పరిహారం విషయంలో కేసీఆర్ ప్రభుత్వం(KCR Govt) నిర్లక్ష్యం వహిస్తోందని విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వరదలు – నష్ట పరిహారంపై శాసనసభ(Legislature) లో చర్చ జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్(Eatala Rajender) మాట్లాడారు. ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేశారు.
దాదాపు 30 నిమిషాల వరకు మాట్లాడిన రాజేందర్.. పలు అంశాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ సూచనలు చేశారు. పొలాలు, ఇతర రంగాలలో పని చేస్తున్న కూలీలకు కూడా రైతు బీమా ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాను రాను వ్యవసాయం భారంగా మారిందని.. పెట్టుబడి సాయం పెంచాల్సిన అవసరం ఉందన్నారు. రైతు బంధు, రైతు బీమా కూలీలకు కూడా భరోసాగా నిలిస్తే బాగుంటుందని తెలిపారు. 14 ఏళ్లు తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడామని.. వరదల్లో నష్టపోయిన వారికి పరిహారం ఇవ్వాలని కోరుతున్నట్టు చెప్పారు.
వర్షాలకు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని.. వానలు కూడా రాష్ట్రం మీద పగబట్టినట్లు వరుసబెట్టి దాడి చేశాయన్నారు రాజేందర్. గత వర్షాలకు నష్టపోయిన వారికి ఇప్పటికీ పరిహారం చెల్లించలేదని ఆరోపించారు. ఎక్కడ చూసినా వరి మాత్రమే పండుతోందని.. ఇతర పంటలవైపు దృష్టి సారించాలని సీఎం చెప్పినా అమలు కాలేదని చెప్పారు. అసలు, ఎప్పటిలోగా రైతు రుణమాఫీ చేస్తారో సీఎం స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేశారు. విద్యపై ఎక్కువగా దృష్టి పెట్టాలని.. విద్యాసంస్థలు పెరుగుతున్నాయి.. వసతిగృహాలు తగ్గిపోతున్నాయని వివరించారు.
ప్రభుత్వ స్కూళ్లపై ప్రజలకు నమ్మకం పోతోందన్న ఈటల.. ప్రైవేట్ సూళ్లలో అధిక ఫీజులు కట్టలేక పేద విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. ఇంజనీరింగ్ సీటు కావాలంటే రూ.4 లక్షల నుంచి రూ.12 లక్షల వకు ఖర్చు అవుతోందని.. ప్రైవేట్ వర్శిటీల్లో కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్ ఉండాలని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కాంట్రాక్టు ఎంప్లాయిస్ ను పర్మినెంట్ చేయాలని కోరారు. ఈ విషయంలో అవసరమైతే ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. సర్వ శిక్ష అభియాన్ లో పని చేస్తున్న వేలాది మందికి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు ఈటల రాజేందర్.
అధికారం ఎవరికీ శాశ్వతం కాదని.. వెయ్యి ఏళ్ళు బతకడానికి రాలేదన్నారు. పదిమంది మెచ్చే పద్ధతిలో ఉండాలని.. ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు. మమ్ముల్ని అవమానించడం అంటే ప్రజలను అవమానించడమేనన్నారు. ఏక పక్ష నిర్ణయాలు మంచిది కాదని.. తమ హక్కులు, ఆత్మగౌరవం కాపాడాల్సిన బాధ్యత స్పీకర్ పై ఉందని తెలిపారు. ప్రతిపక్ష నేతలు, కార్యకర్తల మీద కేసులు పెడుతున్నారని.. ఇకనైనా ఆపాలని ముఖ్యమంత్రిని కోరారు.