స్వాతంత్ర్య సమరయోధ్యమంలో షహీద్ ఖాన్ బహదూర్ ఖాన్(Shaheed bahadur khan)కు ప్రత్యేక స్థానం ఉంది. అప్పట్లో బ్రిటీషర్స్ కులం, మతం ప్రాతిపదికన భారతీయులను విడదీసి వాళ్లల్లో వాళ్లే కొట్టుకునేలా చేసి ఆ తర్వాత వారిపై యుద్ధం ప్రకటించి సామ్రాజ్యాలను, భూభాగాలను ఆక్రమించుకుంటూ వచ్చారు. అలా దేశం మొత్తం వారి చేతుల్లోకి వెళ్లిపోయింది. డబ్బులకు అమ్ముడుపోయే కొందరి వల్ల ఏకంగా 200 ఏళ్లకు పైగా తెల్లదొరలు ఇండియాను పరిపాలించారు.
అయితే,1857లో సిపాయిల తిరుగుబాటుతో రవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యపు కోటలకు బీటలు వారడం మొదలయ్యాయి. ఒక్కో ప్రాంతంలో ఒక్కో తిరుగుబాటు దారుడు పుట్టుకొచ్చాడు. బ్రిటీషర్స్కు నిద్రలేకుండా చేసేవారు.ఒక్కరినీ అంతమొందించామని వారు సంతోషించేలోపు మరో తిరుగుబాటు దారుడు పుట్టుకొచ్చి వారికి భయం అంటే ఏమిటో పరిచయం చేశారు. అటువంటి కొందరు విప్లవకారులు చరిత్రలో కనుమరుగైపోయారు. వారిలో ముఖ్యుడు షహీద్ ఖాన్ బహదూర్ ఖాన్.
షహీద్ ఖాన్ అరబిక్, పర్షియన్, ఇస్లామిక్ భాషలలో సాంప్రదాయ విద్యను అభ్యసించాడు. ఈస్ట్ ఇండియా కంపెనీలో సదర్ అమీన్ (మధ్యవర్తి లేదా స్థానిక సివిల్ జడ్జి) స్థాయికి చేరాడు. అతని పదవీ విరమణ అనంతరం బరేలీకి షిఫ్ట్ అయ్యాడు. అక్కేడ నివసించడం ప్రారంభించాడు. బరేలీలో అందరిచేత గౌరవం అందుకునే రుహెలా చీఫ్ హఫీజ్ రహమత్ ఖాన్ యొక్క మనవడి హోదాను షహీద్ ఖాన్ అనతి కాలంలోనే పొందాడు.
1857లో సిపాయిల తిరుగుబాటు ప్రారంభమైనప్పుడు షహీద్ ఖాన్ వయస్సు 82 సంవత్సరాలు. అప్పుడు తిరుగుబాటు దారులకు షహీద్ ఖాన్ నాయకత్వం వహించేవాడు. ప్రజల మధ్య ద్వేషం (హిందు, ముస్లిం) అనే మతం రంగును పులిమి గొడవలు రేపడానికి బ్రిటీష్ వారు ఎంతో ప్రయత్నించారు. కానీ, బరేలీలో మత సామరస్యం నెలకొనేలా షహీద్ ఖాన్ చర్యలు తీసుకున్నాడు.
31 మే 1857న షహీద్ ఖాన్ రోహిల్ ఖండ్ రాజధాని బరేలీలో తనకు తాను స్వాతంత్ర్యం ప్రకటించుకున్నాడు. అనంతరం హిందువుల పండుగల సమయంలో గోహత్యను నిషేధించారు. ఈయన చర్యల వలన బ్రిటిష్ వారు తమ సామ్రాజ్యవాద విస్తరణ కాంక్షను నెరవేర్చుకోలేకపోయారు. బరేలీలో హిందువులు, ముస్లిములు కలిసి కట్టుగా ఉండేవారు.మతసామరస్యం నెలకొనేందుకు హిందువులు పచ్చ జెండాలు, ముస్లిములు కాషాయ జెండాలను పట్టుకునేవారు.
షహీద్ ఖాన్ తిరుగుబాటు గురించి బ్రిటీష్ హైయ్యర్ అధికారులకు తెలియడంతో వారు బరేలీపై యుద్ధం ప్రకటించారు. ఈ క్రమంలోనే మే 6న బ్రిగేడియర్ జనరల్ జోన్స్ నేతృత్వంలోని కంపెనీ దళాలు బరేలీని రౌండప్ చేశాయి. అప్పుడు బహదూర్ ఖాన్కు నేల మీద యుద్ధం చేయడం తప్ప వేరే మార్గం కనిపించలేదు. దీంతో అతని వద్ద ఉన్న తిరుగుబాటు దారులను రెండు దళాలుగా విభజించాడు.
మొదటి దళంలోని ఫిరంగి వీరులను బరేలీలోకి ప్రవేశించే బ్రిడ్జి వద్ద ఏర్పాటు చేశాడు. రెండోవ దళంలో ఘాజీలతో కూడిన వీరులను ఏర్పాటుచేశారు. వీరు నగర శివారు ప్రాంతాల రక్షణలో కాపు కాసింది. అయితే, బ్రిటీష్ దళాలు వేగంగా మొదటి దళాన్ని ధ్వంసం చేసి షాహీద్ ఖాన్ను ఓడించాయి.దీంతో షహీద్ ఖాన్ అక్కడి నుంచి తప్పించుకుని అహ్మదుల్లా షాతో చేరాలని షాజహాన్పూర్ వైపు వెనక్కి మళ్లాడు.
జూన్ 12న షాజహాన్పూర్ నగర శివారులోకి షహీద్ ఖాన్ చేరుకున్నాడు. అయితే, జూన్ 15న అహ్మదుల్లా షాను పవయాన్ రాజు ద్రోహపూర్వకంగా చంపాడు. ఆ విషయం తెలుసుకున్న షహీద్ ఖాన్ వెంటనే దారి మార్చుకుని నేపాల్ సరిహద్దులోని తెరాయ్ అడవుల్లో తలదాచుకున్నాడు.కొంతకాలం అలాగే ప్రదేశాలు మారుస్తు వచ్చాడు బహదూర్ ఖాన్. కానీ, 1859 డిసెంబర్లో బుట్వాల్ సమీపంలో రాణా జంగ్ బహదూర్ ఖాన్ను పట్టుకున్నాడు.
దీంతో కొంతకాలం షహీద్ ఖాన్ రాణా ఖైదీగా ఉండిపోయాడు. అనంతరం అతన్ని బరేలీకి తీసుకువచ్చి బరేలీ కోటలో బంధించారు. అతని మీద బ్రిటీష్ అధికారులు తిరుగుబాటు అభియోగాలు మోపి ప్రత్యేక విచారణ కమిషన్ ద్వారా మరణ శిక్ష విధించారు. కాగా, 24 మార్చి 1860న బరేలీ జైలులో బహదూర్ ఖాన్ను ఉరితీశారు.