ఓవైపు యువగళం పాదయాత్రతో లోకేష్ (Lokesh), ఇంకోవైపు చంద్రబాబు (Chandrababu) పర్యటనలతో ఏపీలో టీడీపీ (TDP)కి పూర్వ వైభవం వస్తుందని ఆపార్టీ నేతలు భావిస్తున్నారు. అయితే.. ఈ టూర్లలో పలుచోట్ల ఉద్రక్త పరిస్థితులు నెలకొనడం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొన్న చంద్రబాబు పర్యటన సందర్భంగా తంబళ్లపల్లె, పుంగనూరు నియోజకవర్గాల్లో ఘర్షణలు జరిగాయి. టీడీపీ, వైసీపీ (YCP) శ్రేణులు దాడులు చేసుకున్నారు. దీనికి సంబంధించి తాజాగా పోలీసులు కేసులు నమోదు చేశారు.
చంద్రబాబుపై హత్యాయత్నం, నేరపూరిత కుట్ర కింద కేసు నమోదైంది. తంబళ్లపల్లె నియోజకవర్గం అంగళ్లులో జరిగిన ఘర్షణ ఘటనలపై కేసు నమోదు చేశారు పోలీసులు. ముదివీడు పీఎస్ లో చంద్రబాబు సహా 20 మందికి పైగా టీడీపీ నేతలపై కేసు ఫైల్ అయింది. ఉమాపతిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు పోలీసులు. ఏ1గా చంద్రబాబు, ఏ2గా దేవినేని ఉమ, ఏ3గా అమర్నాథ్ రెడ్డి, ఏ4గా ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి సహా నల్లారి కిషోర్, దమ్మాలపాటి రమేష్, గంటా నరహరి, శ్రీరాం చినబాబు, పులవర్తి నాని సహా 20 మందితో పాటు మరికొందరిపై కేసులు పెట్టారు.
ఈనెల 4న మారణాయుధాలు, ఐరన్ రాడ్లు, ఇటుకలు, కర్రలతో వచ్చి దాడి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నాడు ఉమాపతిరెడ్డి. మారణాయుధాలతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారంటూ పోలీసులకు తెలిపాడు. ఈ ఫిర్యాదు మేరకు చర్యలు తీసుకున్నారు పోలీసులు. అయితే.. టీడీపీ నేతలపైనే కేసులు పెట్టడంపై ఆపార్టీ నేతలు భగ్గుమంటున్నారు. ఆనాడు చంద్రబాబు పర్యటనను అడుగడుగునా అడ్డుకునేందుకు వైసీపీ శ్రేణులే దాడులకు పాల్పడ్డారని ఆరోపిస్తున్నారు.
చంద్రబాబు పర్యటనను అడ్డుకోడానికి వైసీపీ శ్రేణులు చేసిన విధ్వంసంలో ఏ1 సీఎం జగన్ రెడ్డేనని అంటున్నారు టీడీపీ నేతలు. పోలీసులు టీడీపీ కార్యకర్తల పాత్ర గురించే మాట్లాడుతున్నారని.. వైసీపీ వాళ్లు చేసిన దాడుల గురించి ఎందుకు మాట్లాడటం లేదని నిలదీస్తున్నారు. 14 ఏళ్లు సీఎంగా పనిచేసిన వ్యక్తి జిల్లా పర్యటనకు వస్తే భద్రత కల్పించాల్సిన బాధ్యత పోలీసులకు లేదా? అని అడుగుతున్నారు.