మొన్న కర్ణాటకలోని బెంగళూరు (Bengaluru) నగర శివారులో బాణాసంచా గోదాంలో పేలుడు జరిగింది. ఈ ఘటన మరువక ముందే మరొకటి పక్కనే ఉన్న తమిళనాడు (Tamilanadu) లోని ఫ్యాక్టరీలో సంభవించింది.
అరియలూర్ జిల్లాలోని టపాసుల ఫ్యాక్టరీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ వెంటనే పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
పేలుడు సమయంలో కార్మికులు ఫ్యాక్టరీ లోపలే పనిచేస్తుండటంతో ప్రాణనష్టం జరిగింది. 25 మంది దాకా మంటల్లో చిక్కుకున్నారు. ఫైర్ సిబ్బంది విషయం తెలిసిన వెంటనే స్పాట్ కు చేరుకుని మంటలను అదుపు చేశారు. కార్మికులను కాపాడారు. గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించారు.
ఈ భారీ పేలుడు కారణంగా పరిశ్రమ చుట్టుపక్కల ఉన్న ఇళ్లు కూడా ధ్వంసమయ్యాయి. అలాగే, ఓ వ్యాన్, ఓ ట్రాక్టర్, 9 ద్విచక్రవాహనాలు దగ్ధం అయినట్టు పోలీసులు వివరించారు. ఫ్యాక్టరీలోని రెండు టపాసుల తయారీ గోదాములు నేలమట్టమైనట్లు చెప్పారు. పేలుడు ధాటికి మంటలు, పొగ వ్యాపించడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు.