శనివారం తెల్లవారు జాము నుంచి..వేరువేరు చోట్ల రెండు రైలు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. అదృష్టవశాత్తు రెండు చోట్లా ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. మహారాష్ట్ర(Maharashtra)లోని నాగ్ పూర్(Nagpur) సమీపంలో తెలంగాణ ఎక్స్ ప్రెస్(Telangana Express)ఎస్-2 బోగీలో ఒక్కసారిగా మంటలు అంటున్నాయి.
ప్రయాణికుల నుండి సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది ట్రైన్‌ను నాగ్‌పూర్ సమీపంలో నిలిపివేశారు. ట్రైన్ ఆగడంతో ప్రయాణికులంతా భయ భ్రాంతులకు లోనై రెలునుంచి బయటకు పరుగులు తీశారు. సహయక బృందాలు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని బోగీలోని మంటలను అదుపు చేశారు.
పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అధికారులు, ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇదిలా ఉండగా కర్ణాటకలోని బెంగళూరు(Bangalore)లో ఉద్యాన్ ఎక్స్‌ప్రెస్ లో ఉన్నట్టుండి మంటలు చెలరేగాయి, సంగొల్లి రాయన్న(Sangolli Rayanna) రైల్వే స్టేషన్‌కు రైలు చేరుకున్న సుమారు రెండు గంటల తర్వాత మంటలు చెలరేగడం సిబ్బందికి ఆశ్చర్యం కలిగించింది.
పెద్ద ఎత్తున పొగలు అలుముకున్నాయి. ప్రయాణికులంతా అప్పటికే దిగి వెళ్లిపోవడం వల్ల ముప్పు తప్పింది. హుటాహుటిన ఉద్యాన్ ఎక్స్‌ప్రెస్(Udyan Express) వద్దకు చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు.
“శనివారం ఉదయం 5:45 గంటలకు ఉద్యాన్ ఎక్ప్రెస్ బెంగళూరు చేరుకుని ప్లాట్‌ఫారమ్-3 వద్ద ఆగింది. సుమారు 7:10 గంటల ప్రాంతంలో రైలులోని B1, B2 కోచ్లతో ఇంజిన్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే అగ్నిమాపక సిబ్బంది సహాయంతో మంటలను ఆర్పివేశారు.
అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. రైల్వే సిబ్బంది ఘటనా స్థలాన్ని సందర్శించి పరిశీలించారు. ఘటనకు గల కారణాలపై విచారణ జరుపుతున్నాం” అని బెంగళూరు రైల్వే అధికారులు తెలిపారు.