హమాస్ ఉగ్ర మూకలపై ఇజ్రాయెల్ (Israel) దాడులు కొనసాగుతున్నాయి. దీంతో ఆ దేశంలో ఉద్రిక్త పరిస్థితుల కారణంగా భారతీయులను రక్షించేందుకు ఆపరేషన్ అజయ్ (Operation Ajay) ప్రారంభించింది భారత్. ఈ క్రమంలోనే తొలి విమానం శుక్రవారం ఉదయం ఢిల్లీ (Delhi) కి చేరుకుంది. ఇందులో 212 మంది స్వదేశానికి చేరుకున్నారు.
ఢిల్లీకి వచ్చిన వారికి కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ (Rajeev Chandrashekar) స్వాగతం పలికారు. గురువారం టెల్ అవీవ్ కు చేరుకున్న చార్టర్డ్ విమానం.. అక్కడి నుంచి బయలుదేరి ఇండియాకు చేరుకుంది. ఇజ్రాయెల్-హమాస్ మధ్య నెలకొన్న ఉద్రిక్త వాతావరణంలో నుంచి తమను సురక్షితంగా స్వదేశానికి తీసుకొచ్చిన భారత ప్రభుత్వానికి బాధితులు కృతజ్ఞతలు తెలియజేశారు.
భారత విదేశాంగ శాఖ లెక్కల ప్రకారం ఇజ్రాయెల్ లో మనోళ్లు సుమారు 18వేల మంది ఉన్నారు. అక్కడి నుంచి వారిని సురక్షితంగా భారత్ కు తీసుకు వచ్చేందుకు ప్రత్యేకమైన ఛార్టెడ్ విమానాలను పంపేందుకు చర్యలు తీసుకుంది కేంద్రం. ఈ సందర్భంగా కేంద్రమంత్రి జైశంకర్ మాట్లాడుతూ.. విదేశాల్లో ఉన్న భారతీయుల రక్షణ, సంక్షేమానికి తాము కట్టుబడి ఉన్నట్టు వెల్లడించారు.
ఇజ్రాయెల్ నుంచి భారతీయులను వేగంగా తీసుకొస్తున్నామని చెప్పారు కేంద్రమంత్రి. ఇప్పటికే రిజిస్టర్ చేసుకున్న భారతీయుల జాబితాను భారత రాయబార కార్యాలయం వారికి ఈ-మెయిల్ చేసింది. తర్వాత బ్యాచుల్లో ప్రయాణించే ప్రయాణికుల జాబితా, విమానాల వివరాలను రిజిస్టర్ మొబైల్ నెంబర్లకు పంపిస్తున్నారు.
ఇజ్రాయెల్ లో యుద్ధం జరగుతున్న ప్రాంతాల్లో పరిస్థితిని పరిశీలించి భారతీయులకు సహాయం చేసేందుకు టెల్ అవీవ్ తో పాటు రమల్లాహ్ ప్రాంతంలో ప్రత్యేక ఎమర్జెన్సీ హెల్ప్ లైన్ నెంబర్లను ఏర్పాటు చేశారు. ఆపరేషన్ అజయ్ విషయంలో భారత్ కు ఇజ్రాయెల్ పూర్తి స్థాయిలో సహకారం అందిస్తోంది.