దేశ రైల్వే రంగంలో ఇవాళ చరిత్రలో నిలిచిపోతుందన్నారు ప్రధాని మోడీ(PM Modi). దేశవ్యాప్తంగా 508 రైల్వే స్టేషన్ల అభివృద్ధికి ఆయన శంకుస్థాపన చేశారు. వర్చువల్ గా ఈ కార్యక్రమం జరిగింది. అమృత్ భారత్ (Amrut Bharat) పథకంలో భాగంగా ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ లో 55, బిహార్ 49, మహారాష్ట్ర 44, పశ్చిమ బెంగాల్ 37, మధ్యప్రదేశ్ 34, అసోం 32, ఒడిశా 25, పంజాబ్ 22, గుజరాత్, తెలంగాణలో 21, ఝార్ఖండ్ 20, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు 18, హర్యానా 15, కర్ణాటకలో 13 రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తున్నారు.
ప్రధాని మోడీ ఈ సందర్భంగా మాట్లాడుతూ… రైల్వే రంగంలో మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించామని వివరించారు. ఈ ఏడాది బడ్జెట్ లో రైల్వే శాఖకు ఎక్కువగా నిధులు కేటాయించామని.. సామాన్యుల కోసమే రైల్వే అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. గత 9 ఏళ్లుగా రైల్వే లేన్లను విస్తరించామని చెప్పుకొచ్చారు. రైల్వే నెట్ వర్క్ విస్తరణకు కేంద్రం అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు.
అమృత్ భారత్ పథకం కింద తెలంగాణలో రూ.894.09 కోట్లతో, ఏపీలో రూ.453.50 కోట్లతో రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తోంది కేంద్రం. మొత్తం 1309 రైల్వే స్టేషన్ల రూపురేఖలు పూర్తిగా మార్చేందుకు ప్రణాళికలు రచించింది. దీనికోసం మొత్తం 24,470 కోట్లకు పైగా ఖర్చు చేస్తోంది.
తెలంగాణలో అభివృద్ధి చేస్తున్న రైల్వే స్టేషన్లు
హైదరాబాద్, హైటెక్ సిటీ, హఫీజ్ పేట, మలక్ పేట, మల్కాజిగిరి ఉప్పుగూడతోపాటు ఆదిలాబాద్, భద్రాచలం, జనగామ, కామారెడ్డి, కరీంనగర్, కాజీపేట, ఖమ్మం, మధిర, మహబూబ్ నగర్, నిజామాబాద్, మహబూబాబాద్, రామగుండం, తాండూరు, రాయగిరి, జహీరాబాద్ రైల్వే స్టేషన్ల అభివృద్ధి పనులకు ప్రధాని శంకుస్థాపన చేశారు.