తెలంగాణ ప్రజాగాయకుడు, ప్రజా యుద్ధనౌక గద్దర్(Gaddar) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ.. ఆదివారం తుదిశ్వాస విడిచారు. గద్దర్ చనిపోయినట్లు ఆయన కుమారుడు సూర్య(Surya) అధికారికంగా ప్రకటించారు.
1949వ సంవత్సరం మెదక్ జిల్లా తుఫ్రాన్ లో జన్మించారు. ఈయన అసలు పేరు గుమ్మడి విఠల్ రావు. చదువు నిజామాబాద్, మహబూబ్ నగర్ లలో జరిగింది. హైదరాబాద్ లో ఇంజనీరింగ్ చేశారు. 1969 తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. 1971లో సినీ దర్శకుడు బీ నరసింగరావు ప్రోత్సాహంతో మొదటి పాట ఆపరా రిక్షా అనే పాట రాశారు. ఈయన మొదటి ఆల్బమ్ గద్దర్. ఆ తర్వాత ఇదే పేరుతో ఆయన్ను పిలవడం మొదలుపెట్టారు.
మాభూమి సినిమాలో యాదగిరి పాత్రలో నటించి.. బండెనక బండి కట్టి అనే పాటను ఆయనే పాడి, ఆడారు. దళితుల ఆవేదనను పాటలు, నాటకాల రూపంలో ప్రదర్శనలు ఇచ్చారు. ఈయన పాటలకు సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. 1990లో జన నాట్య మండలి ఆధ్వర్యంలో హైదరాబాద్ నిజాం గ్రౌండ్స్ లో భారీ బహిరంగ సభ నిర్వహించగా.. 2 లక్షల మంది దాకా వచ్చారు. పీపుల్స్ వార్, అనంతరం మావోయిస్టు, తెలంగాణ ఉద్యమాల్లో తన గళంతో కోట్లాది మంది ప్రజలను ఉత్తేజపరిచారు గద్దర్.