సస్పెన్స్ వీడింది. ఆర్టీసీ బిల్లుకు గవర్నర్ (Governor) ఎప్పుడు ఓకే చెప్తారు? అసలు, చేస్తారా? లేదా? ఇలా అనేక సందేహాలకు తెరపడింది. బిల్లుపై గవర్నర్ తమిళిసై(Governor Tamilisai) లేవనెత్తిన ప్రశ్నలపై అధికారులు క్లారిటీ ఇవ్వడంతో ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం పంపిన బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు ఓకే చెప్పారు.
ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసే అంశంపై కేబినెట్ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. బిల్లును గవర్నర్ దగ్గరకు పంపింది. అయితే.. పలు సందేహాలను లేవనెత్తుతూ సీఎస్ కు లేఖ రాశారు తమిళిసై. దీంతో ఆ ప్రశ్నలకు సమాధానం ఇస్తూ రాజ్ భవన్ వివరణ లేఖ పంపించింది ప్రభుత్వం. దీనిపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ మరికొన్ని సందేహాలను వ్యక్తం చేశారు గవర్నర్.
ఓవైపు బిల్లుపై ఈ లేఖాస్త్రాలు నడుస్తుండగా.. ఇంకోవైపు ఆర్టీసీ కార్మికులు రాజ్ భవన్ ను ముట్టడించారు. దీంతో తమిళిసై వారితో చర్చలు జరిపారు. కార్మికులకు తాను వ్యతిరేకం కాదని, వారి సంక్షేమానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నానని స్పష్టం చేశారు. ప్రభుత్వం నుంచి రెండుసార్లు వివరణ వెళ్ళినా గవర్నర్ సంతృప్తి చెందకపోవడంతో రవాణా కార్యదర్శి సహా ఆర్టీసీ ఉన్నతాధికారులు రాజ్ భవన్ కు వెళ్లారు. అర గంటకు పైగా వీరి మధ్య చర్చలు జరిగాయి.
సమావేశం తర్వాత తమిళిసై సానుకూలంగా స్పందించారు. డ్రాఫ్టు బిల్లులోని అంశాలను పరిశీలించిన తర్వాత తలెత్తిన సందేహాలకు అధికారులు ఇచ్చిన వివరణతో సంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో మూడు రోజుల ఉత్కంఠకు తెరపడినట్లైంది. అయితే.. ప్రభుత్వానికి గవర్నర్ 10 అంశాలను సిఫార్సు చేశారు. న్యాయపర అంశాలు, ఉద్యోగుల ప్రయోజనాలను అందులో పేర్కొన్నారు.