షహీద్ జయకృష్ణ రాజగురు మహాపాత్ర(JAYAKRISHNA RAJGURU MAHAPATRA).. ఈ పేరు వింటే చాలు 17వ సెంచరీలో అప్పటి భారత భూభాగం ఒడిశాలో అక్రమంగా సామ్రాజ్య విస్తరణకు పూనుకున్న బ్రిటీష్ వారికి ముచ్చెమటలు పట్టేవి. పొరుగు దేశం శత్రు రాజులు కూడా (ఖుర్దా)(KuRDA) మీదకు దండెత్తడానికి భయపడేవారు.రాజగురు అటు విద్య, పాండిత్యం, యుద్ధకలల్లో ఆరితేరినవాడు. అంతేకాకుండా గ్రామాల్లోని యువకులకు సైనిక విద్యలు నేర్పించి వారిని వీరులుగా తయారు చేసిన ఘనత షహీద్ జై రాజగురు సొంతం.
షహీద్ జయకృష్ణ రాజగురు మహాపాత్ర ఒడిషాలోని పూరీకి సమీపంగా ఉన్న బీరహరేక్రుష్ణపూర్లో చంద్ర రాజగురు,తల్లి హరమణి దేబీకి జన్మించారు. రాజగురు రాజవంశీయుల పూజారి, కమాండర్-ఇన్-చీఫ్ మరియు ఖుర్దా రాజు అయిన గజపతి ముకుంద దేవ-II యొక్క నిజమైన పరిపాలనా ప్రతినిధిగా ఉండేవాడు.
స్వాతంత్య్రానికి పూర్వం 1780లో షహీద్ రాజగురు 41 ఏళ్ల వయసులో గజపతి దిబ్యసింహ దేవకి ముఖ్యమంత్రి-కమ్-రాజగురుగా అపాయింట్ అయ్యాడు. షహీద్ రాజగురు సంస్కృతంలో చాలా ప్రసిద్ధి చెందిన పండితుడు.గొప్ప తంత్ర సాధకుడు కూడా. 1779లో బాదంబా గడ వద్ద ఖుర్దా రాజు, జానూజీ భోన్సాల మధ్య జరిగిన యుద్ధంలో నరసింగ రాజగురు మరణించగా.. ఆ పరిస్థితుల్లో జై రాజగురు ఖుర్దా యొక్క పరిపాలనా అధిపతిగా, సైన్యాధ్యక్షునిగా నియమితుడయ్యాడు.
యుద్ధాలు జరుగుతున్న కాలంలో బలహీనంగా ఉన్న ‘ఖుర్దా’ ప్రజలపై బార్గీస్ అనే మరాఠా కిరాయి సైనికులు దాడికి తెగబడ్డారు. ఆ టైంలో షహీద్ రాజగురు బూర్గీలకు వ్యతిరేకంగా పోరాడేందుకు (పంచసూత్రి యోజన) పేరిట కొత్త సైన్యాన్ని అభివృద్ధి చేశాడు. ఇందులోని సైనికులంతా వారి రాజ్యంలోని యువకులే.1757లో బ్రిటిష్ వారు ప్లాసీ యుద్ధంలో విజయం సాధించి అప్పుడు ఒడిశాలో భాగంగా ఉన్న బెంగాల్, బిహార్,మదీనాపూర్ ప్రావిన్సులను ఆక్రమించారు.
ఆ తర్వాత 1765లో హైదరాబాదు నిజాం పరిపాలనలో ఉన్న ఆంధ్రప్రదేశ్లోని విస్తారమైన ప్రాంతాన్ని చేజిక్కించుకున్నారు. ఆ తర్వాత గంజాంలో ఖుర్దా వరకు ఒక కోటను నిర్మించారు. గంజాం నుంచి మదీనాపూర్ మధ్య రవాణా నిమిత్తం 1798లో ఖుర్దాపై దాడి చేసి ఆక్రమించుకోవాలని చూశారు. అప్పుడు ఖుర్దా రాజు గజపతి దిబ్యసింహ దేవ్ ఆకస్మికంగా మరణించారు. అయినప్పటికీ షహీద్ రాజగురు బ్రిటీష్ వారికి ఎదురుతిరిగి వారిని ఓడించాడు.
అనంతరం రాజగురు మద్దతుతో ముకుంద దేవ్-II ఖుర్దా రాజు అయ్యాడు. అనంతరం గంజాం జిల్లాల మేజిస్ట్రేట్ కల్నల్ హార్కోర్ట్.. ఖుర్దా రాజుతో గంజాం, బాలాసోర్ల కమ్యూనికేషన్ కోసం రూ.1 లక్ష పరిహారం, మరాఠాల ఆధీనంలో ఉన్న నాలుగు పరగణాలను తిరిగి ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నారు. అయితే, ఈ రెండింటినీ తిరిగి పొందడంలో రాజగురు విఫలమయ్యాడు.
ఆ తర్వాత విదేశీ శక్తుల నుంచి రాజ్యాన్ని కాపాడుకోవడానికి సైన్యాన్ని పునవ్యవస్థీకరించాడు. ఈ క్రమంలోనే సెప్టెంబర్ 1804లో ఖుర్దా రాజు ‘జగన్నాథ దేవాలయం’పై ఉన్న సాంప్రదాయ హక్కులను కోల్పోయాడు. ఇది రాజు, ఒడిషా ప్రజలకు తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది. ఆ తర్వాత అక్టోబర్ 1804లో పిపిలి ప్రాంతం వద్ద బ్రిటీష్ వారిపై సాయుధ పైకాస్ బృందం దాడి చేసింది. రాజగురు పైకాస్ బృందానికి కుజంగ, కణిక, హరీషపుర,మరీచిపుర తదితర రాజులు మద్దతు పలికారు.
ఈ యుద్ధం చాలా కాలం పాటు కొనసాగింది. ఇందులో బ్రిటీష్ వారు ఆధిపత్యం చెలాయించడంతో వారు రాజగురుని అరెస్టు చేసి ఖుర్ధా కోట నుుంచి బారాబతి కోటకు తరలించారు. అయితే, ఖుర్దా రాజు ముకుంద దేవ-IIను కాపాడేందుకు రాజగురు చాలా యత్నించినా బ్రిటీష్ వారు 3 జనవరి 1805న అతన్ని అరెస్టు చేశారు.
అనంతరం రాజగురు, ముకుంద దేవ రాజును కటక్ నుండి మిడ్నాపూర్ జైలుకు పంపారు. రాజగురు, రాజ్యానికి రాజు లేకపోవడంతో రాష్ట్రంలో మరింత హింసాత్మక పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో జైలు నుంచి రాజగురు సమర్పించిన పిటిషన్ను పరిగణనలోకి తీసుకున్న బ్రిటిష్ లాయర్లు ముకుంద దేవ-IIని విడుదల చేసి పూరీకి పంపించారు.
ఆ తర్వాత మదీనాపూర్లోని బాగితోటలో షాహీద్ రాజగురు తిరుగుబాటుపై విచారణ జరిగింది. ‘బ్రిటీష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా’ యుద్ధం చేసినందుకు అతను దోషిగా ప్రకటించబడ్డాడు. చనిపోయే వరకు ఉరితీయాలని ఆదేశాలు వెలువడ్డాయి.కానీ, 6 డిసెంబర్ 1806న అతన్ని ఉరివేసేవారు అతని కాళ్లను చెట్టు యొక్క రెండు కొమ్మలకు కట్టి శరీరాన్ని రెండు భాగాలుగా చీల్చే ప్రయత్నం చేసి చంపేశారు.అప్పట్లో షహీద్ రాజగురు మరణంతో ఖుర్దాలో కొంతకాలం పాటు అశాంతి నెలకొంది.