ప్రపంచ కప్-2023 (World Cup-2023) లో ఆరంభ మ్యాచ్ లోనే భారత్ (Bharat) అదరగొట్టింది. ఆస్ట్రేలియా (Australia) తో జరిగిన మ్యాచ్ లో 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలి 2 ఓవర్లలో 2 పరుగులకే 3 వికెట్లు కోల్పోయినా.. కోహ్లి (Kohli), కేఎల్ రాహుల్ (KL Rahul) నిలకడగా ఆడడంతో భారత్ లక్ష్యాన్ని చేరుకుంది.
చెన్నై (Chennai) వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది ఆసీస్. 49.3 ఓవర్లు ఆడి 199 పరుగులకు ఆలౌట్ అయింది. భారత బౌలర్ల ధాటికి మ్యాచ్ ప్రారంభం నుంచే ఆసీస్ బ్యాటర్లు కంగారు పడ్డారు. పరుగులు రాబట్టడానికి తెగ శ్రమించారు. మూడో ఓవర్ లో బుమ్రా బౌలింగ్ లో ఆసీస్ ఓపెనర్ మిచెల్ మార్ష్ ఔటయ్యాడు. వార్నర్, స్టీవెన్ స్మిత్ నిలకడగా ఆడినా.. 17వ ఓవర్ నుంచ ఆసీస్ కు కష్టాలు మొదలయ్యాయి.
వార్నర్ ఔట్ తో కంగారూలు వికెట్ల పతనం మొదలైంది. 28వ ఓవర్ స్టీవెన్ స్మిత్ ఔట్ తో పరిస్థితి మరింత దిగజారింది. లబుషేన్ (27), గ్లెన్ మాక్స్ వెల్ (15), పాట్ కమ్మిన్స్ (15) తక్కువ స్కోర్లకే పరిమితం అయ్యారు. మిగిలిన ఆటగాళ్లు అయితే మరీ ఘోరం. అలెక్స్ క్యారీ, కామెరూన్ గ్రీన్ ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. భారత బౌలర్లలో జడేజా 3 వికెట్లు, బుమ్రా, కుల్దీప్ యాదవ్ రెండేసి వికెట్లు పడగొట్టారు. అశ్విన్, పాండ్యా, సిరాజ్ తలో వికెట్ తో సరిపెట్టుకున్నారు.
200 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు భారత ఓపెనర్లు రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ బరిలోకి దిగారు. కానీ, ఇద్దరూ డకౌట్ తో వెనుదిరిగారు. శ్రేయాస్ అయ్యర్ కూడా ఇదే బాటలో పయనించాడు. దీంతో గెలుపు బాధ్యతను కోహ్లి, కేఎల్ రాహుల్ భుజానికెత్తుకున్నారు. ఆదిలోనే ఎదురుదెబ్బలు తగలడంతో ఆచితూచి ఆడారు. కమిన్స్ 26వ ఓవర్ మూడో బంతిని సింగిల్ గా మలిచి కోహ్లి, 28వ ఓవర్ తొలి బంతితో సింగిల్ తీసి కేఎల్ రాహుల్ చెరో హాఫ్ సెంచరీ చేశారు.
38వ ఓవర్ లో హేజిల్ వుడ్ వేసిన నాలుగో బంతిని లబుషేన్.. క్యాచ్ పట్టడంతో కోహ్లి 85 పరుగుల దగ్గర ఔట్ అయ్యాడు. హార్దిక్ పాండ్యా 11 పరుగులతో కేఎల్ రాహుల్ (95) కు సపోర్ట్ గా నిలిచాడు. దీంతో భారత్ విజయతీరాలకు చేరుకుంది. 42.2 ఓవర్లకే లక్ష్యాన్ని చేరుకుంది. అద్భుత ఇన్నింగ్స్ ఆడిన కేఎల్ రాహుల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు.