– హమాస్ ముష్కరులపై ఇజ్రాయెల్ కన్నెర్ర
– భీకరంగా సాగుతున్న యుద్ధం
– రెండువైపులా 1,600 మంది దాకా మృతి
– వేల సంఖ్యలో గాయపడ్డ ప్రజలు
– ఇజ్రాయెల్ పీఎంకు మోడీ ఫోన్
– ఉగ్ర దాడులను తీవ్రంగా ఖండించిన భారత్
– క్లిష్ట సమయంలో అండగా ఉన్నందుకు..
– భారత్ కు ధన్యవాదాలు తెలిపిన నెతన్యాహు
హమాస్ మిలిటెంట్ల దాడితో ఇజ్రాయెల్ లోని ప్రధాన పట్టణాలు నిర్మానుష్యంగా మారాయి. 24 గంటలు రద్దీగా ఉండే టెల్ అవీవ్ నగరం ప్రస్తుతం ఎడారిని తలపిస్తోంది. వీధులు, ప్రధాన కూడళ్లలో కూడా జనాల రద్దీ గణనీయంగా తగ్గింది. దక్షిణ ఇజ్రాయెల్ లోని పట్టణాల్లో హమాస్ మిలిటెంట్లు మారణహోమం సృష్టించడం వల్ల ప్రజలు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు.
దాడులు, ప్రతిదాడులతో రెండు దేశాలూ దద్దరిల్లుతున్నాయి. ఈ యుద్ధంలో ఇప్పటి వరకూ రెండు వైపులా 1,600 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, వేల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ యుద్ధంలో ఇజ్రాయెల్ దాడుల్లో 143 మంది పిల్లలు, 105 మంది మహిళలు సహా 704 మంది మరణించారు. 4వేల మందికి పైగా గాయపడ్డారు. ఇక హమాస్ దాడి కారణంగా ఇజ్రాయెల్ లో కనీసం 900 మంది మరణించారు. 2,600 మంది గాయపడ్డారు. బందీలుగా ఉన్న 100 మంది ఇజ్రాయెల్ పౌరుల మృతదేహాలు ఓ వ్యవసాయ పొలంలో లభించాయి.
మరోవైపు, ఇజ్రాయెల్ కు భారత్ మద్దతు తెలిపింది. ఉగ్ర దాడులను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ప్రధాని మోడీ తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్ లో ఓ పోస్ట్ పెట్టారు. ‘నాకు ఫోన్ చేసి పరిస్థితిని వివరించినందుకు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు ధన్యవాదాలు. ఈ క్లిష్ట సమయంలో భారత ప్రజలు ఇజ్రాయెల్ కు అండగా నిలిచారు. అన్ని రకాలుగా ఉగ్రవాదాన్ని భారత్ తీవ్రంగా ఖండిస్తోంది’ అని మోడీ ట్వీట్ లో పేర్కొన్నారు.
ఇక, హమాస్ కు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు హెచ్చరికలు చేశారు. తమపై దాడితో పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్ చారిత్రక తప్పిదానికి పాల్పడిందని అన్నారు.