జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ (Hemant soren) కు మరోసారి ఈడీ (ED) ఆహ్వానం పంపింది. ఈనెల 24 లోపు తమ ముందు హాజరవ్వాలని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసింది. వాస్తవానికి ఆయన ఈనెల 14నే విచారణకు హాజరు కావాలి. దీనికి సంబంధించిన నోటీసులను ముందే పంపించింది ఈడీ. కానీ, ఆయన విచారణకు వెళ్లలేదు. తనకు మరింత సమయం కావాలని అడిగారు.
సీఎం అభ్యర్థన మేరకు ఇన్నాళ్లూ ఆగిన ఈడీ అధికారులు.. తాజాగా నోటీసులు పంపించారు. ఈనెల 24లోపు విచారణకు రావాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో అక్రమ మైనింగ్ వ్యవహారంతో సంబంధం ఉందన్న ఆరోపణలపై గతంలో ఓసారి హేమంత్ ను విచారించింది ఈడీ. గతేడాది నవంబర్ 17న ఈడీ ఎదుట హాజరైన సోరెన్.. 9 గంటల పాటు అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు.
ఇటు భూకబ్జా కేసులో 13 మందిని ఈడీ అరెస్ట్ చేసింది. వీరిలో ఒక ఐఏఎస్ అధికారి కూడా ఉన్నారు. జులై 8న సోరెన్ పార్టీ ఎమ్మెల్యే ప్రతినిధి నివాసంలో జరిపిన సోదాల్లో ఒక చెక్ బుక్ లభించింది. ఇది సీఎం బ్యాంక్ అకౌంట్ కు లింక్ అయి ఉంది. దీంతో, ఈ కేసులో సోరెన్ ను కూడా చేర్చారు అధికారులు.
అయితే.. తమ ప్రభుత్వంపై కుట్రలు జరుగుతున్నాయని జార్ఖండ్ ముక్తి మోర్చా నేతలు అంటున్నారు. ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు సోదాలు, కేసులతో బెదిరింపులకు పాల్పడుతున్నారని మండిపడుతున్నారు. తరచూ ఏదో ఒక కేసుతో హడావుడి చేసి భయపెట్టడం దర్యాప్తు సంస్థలకు అలవాటుగా మారిందని అంటున్నారు.