ఆంధ్రప్రదేశ్ లోని కడప (Kadapa) జిల్లాలో దారుణ ఘటన వెలుగుచూసింది. ఓ కానిస్టేబుల్ విచక్షణారహితంగా తన కన్న బిడ్డల్ని, భార్యను కిరాతకంగా గన్ (Gun) తో కాల్చి చంపేశాడు. తర్వాత తాను కూడా కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ట్విస్ట్ ఏంటంటే.. తన రెండో భార్య కోసం ఈ ఘోరానికి పాల్పడ్డాడు.
వివరాల్లోకి వెళ్తే.. కడపలోని కోఆపరేటివ్ కాలనీలో కుటుంబంతో కలిసి ఉంటున్నాడు కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు. ఈయన టూ టౌన్ పోలీస్ స్టేషన్ రైటర్ గా విధులు నిర్వహిస్తున్నారు. బుధవారం రాత్రి విధులు ముగించిన ఇంటికి వచ్చిన తర్వాత అర్ధరాత్రి సమయంలో తన తన భార్య, ఇద్దరు పిల్లలను తుపాకీతో కాల్చి చంపేశాడు. తర్వాత తాను కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ఈ ఘటనకు సంబంధించిన సమాచారం అందుకున్న కడప పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. కుటుంబ కలహాలతోనే వెంకటేశ్వర్లు ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటాడని ప్రాథమికంగా అంచనా వేశారు. ఒకేసారి నలుగురి ప్రాణాలు చనిపోవడం.. స్థానికంగా కలకలం సృష్టిస్తోంది. ఎస్పీ సిద్ధార్థ కౌశల్ ఘటనా స్థలాన్ని చేరుకుని.. మృతదేహాలను పరిశీలించారు.
వెంకటేశ్వర్లు తాను చనిపోయే ముందు స్టాంప్ పేపర్లలో తన ఆత్మహత్యకు గల కారణాలను వివరంగా రాశారు. అందులో ముఖ్యంగా తనకు వచ్చే బెనిఫిట్స్ తన రెండో భార్యకి చెందాలని.. అలానే తన ఉద్యోగాన్ని రెండో భార్య కుమారుడికి ఇవ్వాలని జిల్లా ఎస్పీకి తెలిపారు. గత కొంతకాలంగా కుటుంబ కలహాలతో ఇబ్బందులు పడుతున్నట్లు సూసైడ్ నోట్ లో రాసి ఉన్నట్లు పోలీస్ అధికారులు చెబుతున్నారు.
వెంకటేశ్వర్లు మొదటి భార్యకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. మొదటి అమ్మాయి బీటెక్ చదువుతుండగా, రెండవ అమ్మాయి పదవ తరగతి చదువుతోంది. రెండో భార్యకు ఒక కుమారుడు ఉన్నాడు. సూసైడ్ నోట్లో రాసిన విధంగా తన బెనిఫిట్స్ అన్నీ కూడా రెండో భార్యకు చెందాలని ఉండడంతో.. ఈ కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. రెండో భార్య వల్లే ఈ ఆత్మహత్య జరిగిందా? లేక, హత్య చేశారా? అని దర్యాప్తు జరుపుతున్నారు.