కాంగ్రెస్(Congress) పార్టీలో జూబ్లీహిల్స్ అసెంబ్లీ టిక్కెట్టు రగడ చోటు చేసుకుంది. మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి(Vishnu Vardhan Reddy)కి వ్యతిరేక వర్గంతో కాంగ్రెస్ పార్టీ నేత అజహరుద్దీన్ (Azharuddin) ఆదివారం నాడు భేటీ అయ్యారు. ఈ పరిణామం కాంగ్రెస్ లో చర్చకు దారి తీసింది.జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీకి అజహరుద్దీన్ ప్రయత్నాలు ప్రారంభించారు.ఈ క్రమంలోనే మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి వ్యతిరేక గ్రూప్‌తో ఆదివారం అజహరుద్దీన్ భేటీ కావడం కాంగ్రెస్ లో చర్చకు దారి తీసింది.
ఈ ఏడాది ఆగస్టు 9వ తేదీన జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధిలోని రహమత్ నగర్ లో అజహరుద్దీన్ వర్గం సమావేశం నిర్వహించింది.ఈ సమావేశం గురించి మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డికి సమాచారం ఇవ్వలేదు. అయితే ఈ విషయం తెలుసుకున్న విష్ణువర్ధన్ రెడ్డి వర్గం అజహరుద్దీన్ వర్గాన్ని నిలదీసింది. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ఇరువర్గాలకు సర్దిచెప్పి అక్కడి నుండి పంపారు.
2009లో కాంగ్రెస్ అభ్యర్ధిగా జూబ్లీహిల్స్ నుండి విష్ణువర్ధన్ రెడ్డి పోటీ చేసి విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో ఇదే స్థానం నుండి పోటీ చేసి టీడీపీ అభ్యర్ధి మాగంటి గోపినాథ్ చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాల్లో మాగంటి గోపినాథ్ టీడీపీని వీడి బీఆర్ఎస్ లో చేరారు. 2018 ఎన్నికల్లో మరోసారి ఇదే స్థానం నుండి బీఆర్ఎస్ అభ్యర్ధిగా మాగంటి గోపినాథ్ విజయం సాధించారు.
ఈ ఏడాది చివరలో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. దీంతో జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంపై అజహరుద్దీన్ కేంద్రీకరించారు. గత ఎన్నికల్లో సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానం నుండి పోటీ చేయాలని అజహరుద్దీన్ ప్రయత్నించారు. కానీ ఆయనకు టిక్కెట్టు దక్కలేదు. దీంతో ఈ దఫా జూబ్లీహిల్స్ నుండి పోటీకి అజహరుద్దీన్ ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ క్రమంలోనే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో అజహరుద్దీన్ పర్యటించడం మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డిని అసంతృప్తికి గురి చేసింది.