రజకులు, నాయి బ్రాహ్మణుల మాదిరిగానే లాండ్రీలు, బట్టలుతకడం, సెలూన్ల నిర్వహణమీద ఆధారపడిన ముస్లింలకు ఉచిత విద్యుత్ పథకాన్ని వర్తింప చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ఖండిస్తున్నానని బీజేపీ (BJP) జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ (Bandi Sanjay) తెలిపారు. ముస్లిం ధోబి ఘాట్లకు, లాండ్రీ షాపులకు 250 యూనిట్ల ఉచిత విద్యుత్ ను అందించాలన్న ప్రభుత్వ నిర్ణయంతో రజకులు ఉపాధి కోల్పోయి రోడ్డున పడతారని తెలిపారు.
కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణయం ఎంఐఎం కోసమే కానీ నిజంగా ప్రజలకు మంచి చేయలని కాదన్నారు. ఈ పథకంతో గల్లీ గల్లీలో వేరే వర్గానికి చెందిన వాళ్ళ లాండ్రీ షాపులు వెలుస్తాయన్నారు. ఇప్పటికే వేరే వాళ్లు దూరడంతో తమ కులవృత్తుల వ్యాపారాలు దెబ్బతిన్నాయని బీసీ కులాల వాళ్ళు తీవ్ర మనో వేదనలో ఉన్నారన్నారు. కేసీఆర్ వదిలేసినా… బీజేపీ ఎప్పుడూ బీసీలకు అండగా నిలుస్తుందని తెలిపారు. అందరం కలిసికట్టుగా బీఆర్ఎస్ కి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.
కేసీఆర్ నయా నిజాం లా మారారని విమర్శించారు. కేసీఆర్ కి మత దురహంకారం ఉంది కాబట్టే ఒక మతం కోసం హిందూ సమాజం లో ఉన్న పలు కులవృత్తులను అణిచివేస్తున్నారని తెలిపారు. ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో మైనార్టీ ఓట్ల కోసం కేసీఆర్ ఇదంతా చేస్తున్నారని విమర్శించారు.