కమ్యూనిస్టులు, కేసీఆర్ (KCR) బంధానికి తూట్లు పడిన విషయం తెలిసిందే. ఆ వివాదం ఎంత దూరం వెళ్లిందంటే కేసీఆర్ ఇచ్చే సీట్లు తమకు వెంటుక్రతో సమానం అని సీపీఐ (CPI) నారాయణ ఘాటు వ్యాఖ్యలు చేసేంత దూరం వెళ్లింది. దీంతో కేసీఆర్ టార్గెట్ గా కమ్యూనిస్టులు (Communists) విమర్శలు చేస్తున్నారు.
ఎవరుపడితే వారు పొత్తులు, ఎత్తులు పేరుతో తమ దరికి చేరి, తర్వాత కాదని పోవడానికి తమది సన్యాసుల మఠం కాదని నారాయణ చెప్పుకొచ్చారు. మొన్నటి వరకు బీజేపీ అంటేనే మండిపడిన కేసీఆర్ తన కుమార్తె కవిత లిక్కర్ స్కాం కేసు విషయంలో బీజేపీకి సరెండర్ అయ్యారని విమర్శించారు. దాంతో ఇప్పుడు బీజేపీకి వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు.
తెలంగాణాలో బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్నారు. తమతో కాంగ్రెస్ కలిసి వస్తే కలిసి పోటీ చేస్తామని నారాయణ స్పష్టం చేశారు. లేదంటే తమ పార్టీ సీపీఐకు బలం ఉన్న 20 స్థానాలు, సీపీఎంకు బలం ఉన్న కొన్ని స్థానాల్లో పోటీ చేస్తామని చెప్పారు. అలాగే జాతీయ స్థాయిలో పొత్తులు వేరు, రాష్ట్ర స్థాయిలో పొత్తులు వేరని నారాయణ తెలిపారు.
ఇండియా కూటమి దెబ్బకి జమిలి ఎన్నికలు, కమిటీ అంటూ మోడీ సరికొత్త డ్రామాకు తెరతీశారని అన్నారు. ఇదే సమయంలో దేశ వ్యాప్తంగా బీజేపీ గ్రాఫ్ పడిపోతుందని చెప్పుకొచ్చారు.