రాష్ట్రంలో డెంగ్యూ (Dengue) జ్వరాలు విస్తరణ రోజురోజుకు విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రజలు చికిత్స కోసం ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు పరుగులు పెడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నిత్యం వందల సంఖ్యలో డెంగ్యూ కేసులు నమోదవుతున్న తీరు డెంగ్యూ విజృంభనకు నిదర్శనం. ఒకవైపు వర్షాకాలం.. ఇంకోవైపు డెంగ్యూ దోమలు ప్రబలడంతో డెంగ్యూ సహా వైరల్ ఫీవర్స్ జ్వరాలు పెరిగిపోయాయి.
డెంగ్యూకు కారణమయ్యే పగటి పూట దోమ ప్రజలకు పగలే చుక్కలు చూపిస్తుంది. డెంగ్యూ జ్వర పీడితులు ప్లేట్ లేట్లు పడిపోతున్నాయన్న ఆందోళనతో ఆసుపత్రుల్లో చేరి బిల్లులతో జేబులు గుల్ల చేసుకుంటున్నారు. చిన్నారుల నుంచి పెద్ద వాళ్ల వరకు డెంగ్యూ జ్వరాల బారిన పడుతున్నారు. ఒక్క నల్గొండ జిల్లా పరిధిలోనే ఆగస్టు నెలలో అధికారిక లెక్కల మేరకే 192డెంగ్యూ కేసులు నమోదయ్యాయి.
ఈనెలలో ఇప్పకే 88మంది డెంగ్యూ బారిన పడి చికిత్స పొందుతున్నారు. ఇక హైద్రాబాద్ వైద్యారోగ్యశాఖ పరిధిలో గడిచిన రెండు మాసాల్లో 1031కేసులు నమోదయ్యాయి. నిత్యం జిల్లా కేంద్ర ఆసుపత్రులు, ఏరియా ఆసుపత్రుల్లో కనీసం ఐదు నుండి పది మంది డెంగ్యూ జ్వరంతో చేరుతున్నారు. ఇక ప్రైవేటు ఆసుపత్రుల వెళ్లే వారి సంఖ్య వందల్లో ఉంటుంది.గడిచిన రెండు నెలల్లో డెంగ్యూ జ్వరంతో రాష్ట్రంలో పది మందికి పైగా మృతి చెందినట్లుగా తెలుస్తుంది. వర్షాకాలం కావడంతో దోమల విస్తరణ అధికమైంది. దోమల నిర్మూలన చర్యలలో గ్రామ పంచాయతీలు, మున్సిపాల్టీలు సరైన చర్యలు చేపట్టక దోమల ప్రబలుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
ప్రభుత్వం నుంచి పారిశుద్ధ్య పరిరక్షణకు వచ్చిన నిధులతో దోమల నివారణకు ఫాగింగ్ చేయాల్సి ఉన్న నామమాత్రంగా కూడా చేయడం లేదన్న ఆరోపణలు సాధారణంగా మారాయి. ఒక్క గ్రేటర్ పరిధిలోనే ఏటా 15కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నా దోమల నివారణలో ఆశించిన ఫలితాలు కనిపించడం లేదు. నాలాలు పొంగడం, వర్షం నీరు, మురుగునీరు రోడ్లపైకి పారడంతో పారిశుద్ధ్యం మరింత అస్తవ్యస్తమై దోమలు మరింతగా ప్రబలుతున్నాయి.
ప్రజలకు డెంగ్యూ వైద్య ఖర్చులు భారంగా మారుతున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రులపై నమ్మకం లేని వారు డెంగ్యూ జ్వరానికి భయపడిపోయి ప్రైవేటు, కార్పోరేట్ ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. అక్కడ డెంగ్యూ నిర్ధారణ జరిగినట్లుగా తేలితే ఆసుపత్రుల్లో ఆడ్మిట్ కావాలంటూ చెప్పి, ప్లేట్లేట్లు, ప్లాస్మా ఎక్కించాలంటూ అవసరమున్నా లేకున్నా వైద్య చికిత్సల పేరుతో పలురకాలుగా బిల్లులు వేస్తూ రోగుల జేబులకు చిల్లులు పెడుతున్నారు. కొన్ని చోట్ల వైరల్ జ్వరాలను సైతం డెంగ్యూగా నిర్ధారిస్తూ అక్రమ దోపిడి సాగిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ప్రభుత్వం డెంగ్యూ జ్వరాలు, వైరల్ ఫీవర్స్పై ప్రత్యేక దృష్టి పెట్టి దోమల నివారణకు, జ్వర పీడితులకు మెరుగైన చికిత్సలకు చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.