మాదాపూర్ డ్రగ్స్ కేసు (Madapur Drugs case)లో కీలక విషయాలు బయటపడుతున్నాయి. ఈ కేసులో నిందితుడిగా ఉన్న సినీ ఫైనాన్షియర్ (Cine Financier) వెంకట రత్నాకర్ రెడ్డి (Venkata Ratnakar Reddy) విషయంలో స్టేట్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో (Narcotics Buearu) అధికారులు లోతుగా విచారిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో అతడిపై వివిధ రకాల మోసాలకు సంబంధించి 25కు పైగా ఉన్నట్లు వీరి దర్యాప్తులో వెల్లడైంది.
గుంటూరుకు చెందిన వెంకట రత్నాకర్ రెడ్డి గతంలో ఒక వ్యభిచార కేసులో అరెస్టై ఆ తర్వాత అమెరికా వెళ్లిపోయారు. అక్కడి నుంచి తిరిగి వచ్చిన వెంకట్ రత్నాకర్ రెడ్డి సినీ ఫైనాన్షియర్ అవతారమెత్తారు. ఆ క్రమంలో రేవ్ పార్టీలకు హాజరయ్యేవాడు. అక్కడ హై ప్రొఫెల్ పీపుల్ తో పరిచయాలు పెంచుకునేవాడు. ఈ క్రమంలోనే ఇద్దరు సినీ నిర్మాతల (Cine Producers) నుంచి రూ.30 లక్షలకు పైగా అతడు వసూలు చేసినట్లు, ఒక అధికారిణిని కూడా అబద్ధాలు చెప్పి పెళ్లి చేసుకుని మోసం చేసినట్లు బయటపడింది.
వెంటక్ రత్నారక్ రెడ్డికి సంబంధించి అనేక వివరాలను నార్కోటిక్స్ బ్యూరో పోలీసులు సేకరించారు. సినిమాల్లో అవకాశాల పేరిట యువతులకు రప్పించి, వారితో రేవ్ పార్టీలు నిర్వహించి అందులో డ్రగ్స్ సప్లై (Drugs supply) చేస్తున్నట్లు సమాచారం సేకరించారు. అలాగే ఇతర రాష్ట్రాల నుంచి యువతులను రప్పించి వ్యభిచారం చేయించడం, మరో వైపు హైదరాబాద్‌లో డ్రగ్స్ పార్టీలు నిర్వహిస్తున్నట్లుగా కూడా అధికారుల విచారణలో తేలింది.
ప్రస్తుతం పోలీసులు వెంకట రత్నాకర్‌రెడ్డి మెబైల్ ఫోన్లను పోలీసులు పరిశీలిస్తున్నారు. అతడితో పరిచయాలు, సన్నిహితులను కేసు దర్యాప్తులో భాగంగా ప్రశ్నించాలని భావిస్తున్నారు. ఎక్కడి నుంచి మాదక ద్రవ్యాలు తీసుకొచ్చారు, దీనికోసం ప్రత్యేకంగా ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు? నైజీరియన్లతో వెంకట్ రత్నాకర్ రెడ్డికి ఉన్న సంబంధాలు తదిత అంశాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అతడు నిర్వహించే డ్రగ్స్ పార్టీలకు హాజరైన వారి వివరాలను కూడా సేకరిస్తున్నారు.