మరి కొన్ని రోజుల్లో రాజస్థాన్(Rajasthan) లో ఎన్నికలు (Elections) రానున్నాయి. ఈ క్రమంలో ఆ రాష్ట్రంలో కాంగ్రెస్(Congress) కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ ముఖ్య నాయకురాలైన జ్యోతి మీర్దా(Jyothi Mirdha) ఆ పార్టీని వీడి కమలం గూటికి (BJP) చేరారు. ఆమె సోమవారం బీజేపీ కండువా కప్పుకున్నారు. ఆమె తో పాటు మాజీ ఐపీఎస్ అధికారులు , రాజకీయ నాయకుడు వచ్చిన సవాయ్ సింగ్ చౌదరి కూడా బీజేపీ లో చేరారు.
ఢిల్లీలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో రాజస్థాన్ బీజేపీ అధ్యక్షుడు సీపీ జోషి సమక్షంలో ఈ ఇద్దరూ కూడా బీజేపీ కండువా కప్పుకున్నారు.రాజస్థాన్లోని నాగౌర్ ప్రాంతంలో మీర్దా, చౌదరి బలమైన నేతలుగా పేరుండటంతో ఆ ప్రభావం రాబోయే ఎన్నికల్లో బలంగా ఉంటుందని బీజేపీ చెబుతోంది. జాతి నిర్మాణ బాధ్యతలకు కాంగ్రెస్ పార్టీ తిలోదకాలు ఇచ్చిందని, పార్టీ నేతలు, కార్యకర్తలను ఆ పార్టీ నిర్లక్ష్యం చేసిందని మీర్దా ఆరోపించారు.
బీజేపీలో తాజా చేరికలతో నాగౌర్ ప్రాంతంలో కాంగ్రెస్ ఫలితాలపై ప్రభావం ఉండవచ్చని చెబుతున్నారు.నౌగర్ లోక్సభకు జ్యోతి మీర్దా ఈసారి బీజేపీ నుంచి పోటీ చేసే అవకాశాలున్నాయి. నాగౌర్ నుంచి ఆరుసార్లు ఎంపీగా ఎన్నికైన నాథూరామ్ మీర్దా మనుమరాలే జ్యోతి మిర్దా. నాగౌర్ ప్రాంతంలో నాథూరామ్ మీర్దాకు గట్టి పట్టు ఉంది. జ్యోతి మీర్దా 2009లో తొలిసారి నాగౌర్ నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి గెలిచారు.
ఆ తర్వాత 2014, 2019 ఎన్నికల్లో ఓటమి చవిచూశారు. 2019లో బీజేపీ మద్దతిచ్చిన హనుమాన్ బెనివాల్ చేతిలో జ్యోతి మీర్దా ఓడిపోయారు. ప్రస్తుతం బెనివాల్, బీజేపీ మధ్య సత్సంబంధాలు లేవు. సవాయ్ సింగ్ చౌదరి సైతం నాగౌర్ ప్రాంతానికి చెందిన వారే. రాబోయే అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ విజయానికి కృషి చేస్తానని ఆమె చెప్పారు. రాష్ట్రంలో పటిష్ట ప్రభుత్వం ఏర్పాటుకు, కేంద్రంలో మూడవ సారి బీజేపీ ప్రభుత్వం వచ్చేందుకు పనిచేస్తానని అన్నారు. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ కీలక నాయకత్వంలో ఇండియా గణనీయంగా అభివృద్ధి సాధించిందని ప్రశంసించారు.