ఆదివారం ఖమ్మంలో బీజేపీ సభ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సభకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా హాజరై కీలక ప్రసంగం చేయనున్నారు. ఈ సభా వేదికపై పలువురు కీలక నేతలను బీజేపీలోకి ఆహ్వానిస్తామని గతంలో రాష్ట్ర బీజేపీ నేతలు చెప్పిన సంగతి తెలిసిందే. అయితే, పార్టీలో చేరికల గురించి సమాచారం లేదు.
కానీ, ఈటల రాజేందర్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్.. తుమ్మల నాగేశ్వరరావును పార్టీలోకి ఆహ్వానిస్తామని తెలిపారు. ఆయనను కలిసి చర్చిస్తామని వివరించారు. కేసీఆర్ పార్టీ బీఆర్ఎస్ తుమ్మలను అవసరానికి వాడుకుని వదిలేసిందని ఆరోపించారు. ఆయనను తమ పార్టీలోకి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తామని చెప్పారు.
ఈ సందర్భంగా ఆయన బీఆర్ఎస్ పై విమర్శలు హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సంధించారు. తెలంగాణలో రైతులు కష్టాల్లో చిక్కుకుందని అన్నారు. రైతులకు బీజేపీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ రోజు నిర్వహిస్తున్న సభలో అమిత్ షా రైతు డిక్లరేషన్ ప్రకటిస్తారని చెప్పారు. దీని ద్వారా బీజేపీ వైఖరిని తాము స్పష్టం చేయనున్నామని వెల్లడించారు. బీఆర్ఎస్ రైతు వ్యతిరేక పార్టీ అని, రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం తథ్యం అని ధీమా వ్యక్తం చేశారు.
పాలేరు బీఆర్ఎస్ టికెట్ ఆశించి తుమ్మల నాగేశ్వరరావు భంగపడ్డారు. పాలేరు సీటుకు బీఆర్ఎస్ కందాళ ఉపేందర్ రెడ్డికి టికెట్ ఇచ్చింది. దీంతో తుమ్మల అసంతృప్తి చెందారు. అయితే.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని స్పష్టం చేశారు. కానీ, ఏ పార్టీలో చేరనున్నారో వెల్లడించలేదు.
తుమ్మల అనుచరులు మాత్రం ఆయనను కాంగ్రెస్లోకి వెళ్లాలని ఒత్తిడి చేస్తున్నట్టు తెలుస్తున్నది. ఈ సందర్భంలో ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తుమ్మల నాగేశ్వరరావును బీజేపీలోకి ఆహ్వానిస్తామని చెప్పారు. నేడు బీజేపీ సభ జరగబోతున్న ఖమ్మం జిల్లాలో తుమ్మల కీలక నేత కావడం గమనార్హం.