తెలంగాణ(telangana)లో మరికొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు (elections) జరగనున్నాయి. ఇందుకోసం అన్ని పార్టీలు సన్నద్ధం అవుతున్నాయి. ఇప్పటికే అధికార బీఆర్ఎస్ (brs) పార్టీ నియోజకవర్గాల వారిగా అభ్యర్థులను సైతం ప్రకటించింది. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ, బీజేపీలు నియోజకవర్గాల అభ్యర్థుల ఎంపికపై దృష్టిపెట్టాయి.
ఈసారి జరిగే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది మేమేఅంటూ కాంగ్రెస్(congress) పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసేందుకు ఆ పార్టీ నాయకులు హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో దరఖాస్తులు చేసుకుంటున్నారు. గురువారం సాయంత్రం వరకు ఆయా నియోజకవర్గాల నుంచి పోటీచేసేందుకు కాంగ్రెస్ నేతలు 700 మందికిపైగా గాంధీ భవన్లో దరఖాస్తులు దాఖలు చేశారు.
రాష్ట్రంలోని ఆయా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసేందుకు ఆశావాహులు గాంధీభవన్ కు క్యూ కడుతున్నారు. టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డితో పాటు పలువురు నాయకులు టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు పార్టీ టికెట్ కేటాయించాలని కోరుతూ గాంధీభవన్ లో దరఖాస్తు చేసుకున్నారు. ఆయన తరుపున ఆ నియోజకవర్గానికి చెందిన నాయకులు గురువారం దరఖాస్తు అందజేశారు.
మరోవైపు.. షబ్బీర్ అలీ కామారెడ్డి నియోజకవర్గం టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ నియోజకవర్గం నుంచి సీఎం కేసీఆర్ బరిలో నిలుస్తున్నట్లు ఇప్పటికే వెల్లడించారు. పొన్నాల లక్ష్మయ్య జనగామ నియోజకవర్గం నుంచి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి జగిత్యాల నుంచి పోటీ చేసేందుకు దరఖాస్తు చేసుకున్నారు. అదేవిధంగా ఖైరతాబాద్ నియోజకవర్గం కోసం దివంగత పీజేఆర్ కుమార్తె విజయారెడ్డి దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటికే ఈ నియోజకవర్గం నుంచి రోహిణ్ రెడ్డి, వినోద్ రెడ్డిలు దరఖాస్తులు ఇచ్చారు.
మరోవైపు పదహారు సంవత్సరాలపాటు మంత్రిగా, ఏడుసార్లు ఎమ్మెల్యేగా సేవలందించిన కాంగ్రెస్ సీనియర్ నేత కుందూరు జానారెడ్డి రానున్న ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మిర్యాలగూడ నియోజకవర్గం నుంచి ఆయన పెద్ద కుమారుడు రఘువీర్ రెడ్డి, నాగార్జున సాగర్ నియోజకవర్గం నుంచి ఆయన చిన్న కుమారుడు జైవీర్ రెడ్డి పోటీలో దిగేందుకు సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈమేరకు జైవీర్ గురువారం గాంధీభవన్ లో దరఖాస్తు అందజేశారు.
శుక్రవారం రఘువీర్ రెడ్డి కూడా మిర్యాలగూడ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగేందుకు కాంగ్రెస్ టికెట్ కోసం దరఖాస్తు చేస్తారని తెలిసింది. ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఖమ్మం, పాలేరు, కొత్తగూడెం నియోజకవర్గాల కోసం దరఖాస్తు చేసుకున్నట్లు తెలిసింది. అయితే, ఈ మూడు నియోజకవర్గాల్లో ఏదోఒక స్థానం నుంచి పొంగులేటి పోటీ చేయనున్నారు. దరఖాస్తుల స్వీకరణకు శుక్రవారం చివరి రోజు కావడంతో భారీగా ఆశావహులు టికెట్ కోసం దరఖాస్తు చేసుకొనే అవకాశం ఉన్నట్లు గాంధీభవన్ వర్గాలు భావిస్తున్నాయి.