తెలంగాణా రాష్ట్ర ప్రజలకు గవర్నర్ (Governor) తమిళి సై తెలంగాణా విమోచన దినోత్సవ (Telangana Liberation Day) శుభాకాంక్షలు తెలిపారు. ఇవాళ తెలంగాణా విమోచన దినోత్సవాన్ని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా రాజ్ భవన్ (Raj Bhavan) లో జాతీయ జెండాను గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ ఆవిష్కరించారు. అలాగే ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టిన రోజు కావడంతో ఆయనకు గవర్నర్ శుభాకాంక్షలు చెప్పారు.
భారత పతాకం ఇప్పుడు చంద్రునిపై రెపరెపలాడుతుందని తమిళి సై అన్నారు. తెలంగాణా విమోచన దినోత్సవం జరుపుకోవడం ఆనందంగా ఉందని, ఇది మన స్వేచ్ఛకు, సమైక్యతకు ప్రతీక అని అన్నారు. ప్రస్తుతం మనం అనుభవిస్తున్న స్వేచ్చ స్వాతంత్ర్యాలు, అనుభవిస్తున్న హక్కుల కోసం ఎందరో నాయకులు తమ జీవితాలను త్యాగం చేశారని, వారి అడుగుజాడల్లో మనం నడవాలని అన్నారు.
రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకుని వెళ్లడంలో ఎందరో ప్రముఖ పాత్ర వహించారని, అందులోనూ యువత పాత్రని మరువలేనిదని చెప్పారు. రాష్ట్రాన్ని అభివృద్ధిలో నడిపించడానికి తమ వంతు కృషి చేస్తామని చెప్పారు. యువత లక్ష్య సాధన దిశగా అడుగులేయానలి, ఏదైనా లక్ష్యం పెట్టుకుని దానిని సఫలీకృతం చేసుకునే దిశగా కష్టపడాలని ఆమె యువతకు సూచించారు.
రాజ్ భవన్ తరపున ఈ ఏడాది మొత్తం సీపీఆర్ శిక్షణపై అవగాహన కల్పిస్తామన్నారు. పెద్ద పెద్ద మాటలు చెప్పడం కంటే…చిన్నచిన్న పనులు చేయడం మేలు అని గవర్నర్ తమిళి సై అన్నారు.