ఎన్నికల (Elections) సమయం కావడంతో కాంగ్రెస్ డ్రామాలు మొదలుపెట్టిందని, ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు కాంగ్రెస్ (Congress) ఎక్కడికి వెళ్లిందని మంత్రి హరీష్ రావు (Harish Rao) ప్రశ్నించారు. ఆకలైనప్పుడు అన్నం పెట్టనోళ్లు.. ఓట్ల సమయంలో గోరు ముద్దలు పెట్టడానికి వస్తున్నారని అలాంటి వారిపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి హరీష్ రావు విమర్శించారు.
60 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రజలను పట్టించుకోలేదని, అలాంటి కాంగ్రెస్ ను ఇప్పుడు ప్రజలు నమ్మేస్థితిలో లేరని హరీష్ అన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు నీళ్లు ఇవ్వలేదు, ఉద్యోగ నియామకాలు లేవు, నాణ్యమైన విద్యుత్ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీని నమ్మితే మునిగిపోతామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష పార్టీలు కేవలం ఓట్లను లూఠీ చేసేందుకు కుట్ర పన్నుతున్నాయన్నారు.
సంగారెడ్డి జిల్లా పటాన్ చెరులో బీసీ, ఎంబీసీ, మైనార్టీలకు మంత్రి హరీష్ రావు చెక్కులను పంపిణీ చేశారు. జీఓ 58, 59 పట్టాల పంపిణీతో పాటు కళ్యాణలక్ష్మీ షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డితో కలిసి మంత్రి హరీష్ రావు అందజేశారు.
మైనార్టీల అభివృద్ధికి, సంక్షేమానికి ఏ ఇతర రాష్ట్రాలు కేటాయించని విధంగా బడ్జెట్లో నిధులు కేటాయిస్తున్న రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. త్వరలోనే మెట్రో రైలు మియాపూర్ నుంచి ఇస్నాపూర్ వరకు విస్తరణ జరగబోతుందని చెప్పారు.