తెలంగాణా (Telangana) లో వివిధ జిల్లాల్లో ఉద్యోగాల్లో చేరుతున్న 310 ఫార్మసిస్టులకు మంత్రి హరీష్ రావు (Harish Rao) పోస్టింగ్ ఆర్డర్స్ అందజేశారు. రవీంద్ర భారతి వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణ వైద్యారోగ్య శాఖ (Telangana Health Dept) పదేళ్ల ప్రగతి నివేదిక విడుదల చేశారు. ప్రైవేటు ఉద్యోగాలతో పోలీస్తే ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రజలకు సేవ చేసే అవకాశం లభిస్తుందని హరీష్ రావు అన్నారు.
9 ఏళ్లలో వైద్య శాఖలో 22,600 పోస్టులు భర్తీ చేశామని, మరో 7291 పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతున్నదని చెప్పారు. గత పదేళ్లలోపు 30 వేల ఉద్యోగాలు వైద్య శాఖలో ఇచ్చిన ఘనత కేసిఆర్ కు దక్కుతుందన్నారు. పదేళ్ల ప్రయాణంలో ఆరోగ్య రంగంలో తెలంగాణ దేశానికి రోల్ మోడల్ అయ్యిందని, అరవై ఏళ్లలో సాధ్యం కాని అద్భుతాలను దశాబ్ద కాలంలోనే ఆవిష్కరించించిన ఘనత కేసీఆర్ దే అన్నారు హరీష్ రావు.
2014లో నీతి ఆయోగ్ ఆరోగ్య సూచిలో తెలంగాణా రాష్ట్రం 11 వ స్థానంలో ఉంటే, ఇప్పుడు 3 వ ర్యాంకుకు చేరుకున్నామని, మొదటి స్థానానికి చేరడానికి అడుగులు వేస్తున్నామని ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. ఒకప్పుడు నేను రాను బిడ్డో సర్కారు దవాఖాన అంటే, నేడు సీఎం కేసీఆర్ పాలనలో పోదాం బిడ్డో సర్కారు దవాఖానకే అనేలా మార్పు జరిగిందన్నారు.
తెలంగాణ వైద్యారోగ్య రంగం ఎటువంటి హెల్త్ ఎమర్జెన్సీని అయినా తట్టుకోవడానికి సర్వ సన్నద్ధంగా రూపొందిందని చెప్పారు. అవయవ దానం, అవయవ మార్పిడుల్లో దేశంలోనే తెలంగాణ ముందంజలో ఉందని కేంద్రం ఇటీవలే చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ముఖ్యంగా నిమ్స్ ఆస్పత్రిలో ఆరు నెలల్లోనే 100 కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్ ఆపరేషన్లు పూర్తి చేశారని, ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్ లో ప్రతి నెల సగటున 8 మందికి బోన్ మారో ట్రాన్స్ ప్లాంట్ ఉచితంగా చేస్తున్నామని తెలిపారు.
త్వరలో రాష్ట్రంలో ఎయిర్ అంబులెన్సులు ప్రవేశపెట్టబోతున్నామని, ఏ మూలన ఆరోగ్యపరంగా అత్యవసర పరిస్థితి ఏర్పడిన హెలికాప్టర్ ద్వారా వారిని దవాఖానకు తరలిస్తామన్నారు. ఒకప్పుడు కోటీశ్వరులకే పరిమితమైన ఈ సేవలను పేదలకు అందిస్తున్న ఘనత కేసీఆర్ దేనని హరీష్ రావు చెప్పారు.