రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో హైదరాబాద్ (Hyderabad) వణికిపోతోంది. భారీ వర్షంతో నాలాలు (Man Hole) ఏరులై పారుతూ ప్రజల (People) ప్రాణాలకు రక్షణ లేకుండా చేస్తున్నాయి. ఇటీవలే ఒక మహిళ నాలాలో పడి మృతి చెందిన విషయం తెలిసిందే. తాజాగా అలాంటి సంఘటనే హైదరాబాద్ లోని ప్రగతి నగర్ ఎన్ఆర్ఐ కాలనీలో చోటుచేసుకుంది. ఇంటిముందున్న వర్షం నీటిలో ఆడుకుంటున్న నాలుగేళ్ల బాలుడు మిథున్ రెడ్డి ప్రమాదవశాత్తు దగ్గరలో తెరిచి ఉన్న మ్యాన్ హోల్ లో పడి కొట్టుకుపోయాడు.
ఇంటిముందే ఆడుకుంటున్న బాలుడు ఎంతకీ తిరిగి రాకపోవడంతో అనుమానం వచ్చిన తల్లిదండ్రలు స్థానికంగా ఉన్న సీసీ కెమేరాలను పరిశీలించగా… బాలుడు మ్యాన్ హోల్లో పడిపోయిన సంగతి బయటపడింది. దీంతో దగ్గరలోని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
బాలుడు పడిపోయాడన్న విషయం తెలిసిన వెంటనే పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. బాలుడు పడిపోయిన మ్యాన్ హోల్ కి కనెక్ట్ అయిన ప్రగతి నగర్ లోని తుర్క చెరువులో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే సంఘటనా స్థలానికి కిలోమీటరు దూరంలో ఉన్న రాజీవ్ గృహకల్ప దగ్గర బాలుడి డెడ్ బాడీ కొట్టుకుపోతున్న స్థానికుల సమాచారంతో పోలీసులు గజఈతగాళ్లను పెట్టి బాలుడిని వెలికితీసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇంటిముందు ఆడుకుంటున్న తమ బాబు ఎప్పటికీ తిరిగిరాడని తెలుసుకున్న తల్లిదండ్రులు గుండెలు పగిలేలా ఏడుస్తుండటంతో అక్కడి వాతావరణం అంతా హృదయవిదారకంగా మారింది.